TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు-telangana universities new vc appointment process started 1382 applications received ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Universities Vcs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

HT Telugu Desk HT Telugu
May 19, 2024 05:15 PM IST

TS Universities VCs : తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్ లర్ల పదవీ కాలం మే 21తో ముగియనుంది. దీంతో కొత్త వీసీల నియామకాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు
తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

TS Universities VCs : రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్ లర్ల పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. 2021 మే 21న అప్పటి ప్రభుత్వం వర్సిటీలకు వీసీలను నియమించగా.. వారి మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో పూర్తి కానుంది. దీంత కొత్త వీసీల నియామకం కోసం ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దీంతో సెర్చ్ కమిటీల భేటీ అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్ లను నియమించే అవకాశం ఉంది. వీసీల నియామకాలకు ఈసీ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

yearly horoscope entry point

10 వర్సిటీలు.. వందల సంఖ్యలో అప్లికేషన్లు

రాష్ట్రంలో మొత్తంగా 12 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండగా.. అందులో 10 వర్సిటీలకు వీసీల నియామకానికి సర్కారు కసరత్తు చేస్తుంది. ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీతో పాటు హైదరాబాద్ కోఠి మహిళా యూనివర్సిటీ వీసీల నియామకానికి వివిధ సమస్యలున్నాయి. ఇక రాష్ట్రంలోని పది యూనివర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్), జవహర్ లాల్ నెహ్రూ ఆర్టికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్), మహాత్మాగాంధీ యూనివర్సి టీ (నల్గొండ), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్ నగర్) ఉన్నాయి. ఆయా యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్ల పదవీకాలం మే 21 ముగియనుండటంతో కొత్త వీసీలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే అర్హులపై ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. దీంతో మొత్తం 10 యూనివర్సిటీలకు 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు యూనివర్సిటీలకు దరఖాస్తు పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా అంబేడ్కర్ యూనివర్సిటీకి 208, ఉస్మానియాకు 193, పాలమూరు 159, శాతవాహన 158, మహాత్మగాంధీ యూనివర్సిటీకి 157 చొప్పున పెద్ద సంఖ్యలో అప్లికేషన్ పెట్టుకున్నారు.

కేయూకు పెరిగిన పోటీ

కాకతీయ యూనివర్సిటీని 1976లో ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు 14 మంది ప్రొఫెసర్లు వైస్ ఛాన్స్ లర్లుగా పని చేశారు. ప్రస్తుతం వీసీగా పని చేస్తున్న తాటికొండ రమేశ్ పని తీరుపై తీవ్ర విమర్శలు ఉండగా.. కేయూకు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో పది నుంచి 12 మంది మాత్రమే వచ్చే దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు 55కు చేరింది. కాగా కేయూ 15వ వీసీ పోస్ట్ కోసం ప్రొఫెసర్ గా పదేళ్ల అనుభవం కలిగిన వారితో పాటు మాజీ వీసీలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు కూడా పోటీ పడుతున్నారు. ఇందులో ప్రస్తుత వీసీ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, ఇదివరకు కేయూ వీసీగా పనిచేసిన బి. వెంకటరత్నం, మహాత్మగాంధీ వర్సిటీ వీసీగా పని చేసిన ఖాజా అల్తాఫ్ హుస్సేన్, శాతవాహన వీసీగా చేసిన ఎండీ.ఇక్బాల్ అలీతో పాటు ప్రొఫెసర్లు మంద అశోక్ కుమార్, మల్లారెడ్డి, బన్న అయిలయ్య కూడా ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు

వీసీల నియామకానికి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఆల్రెడీ సెర్చ్ కమిటీలను కూడా నియమించింది. ఇందులోయూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీ, సర్కారు నామినీ ఇలా ముగ్గురు సభ్యులు ఉంటారు. కాగా వీరంతా భేటీ అయి నిర్ణయం తీసుకుని ముగ్గురి పేర్లను గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. అందులో ఒకరిని గవర్నర్ వీసీగా నియమిస్తారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో కోడ్ ముగిసిన తరువాత వీసీ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా వీసీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న కొందరు ప్రొఫెసర్లు వారివారి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. పోస్టు తమకే వచ్చేలా చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లోనే వర్సిటీలకు నూతన వీసీలు రానుండగా.. అందులో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner