కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా..? తెరపైకి మరో కొత్తరకం ట్యాక్స్...! ఈ వివరాలు తెలుసుకోండి-telangana transport department decides to impose road safety cess on new vehicles ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా..? తెరపైకి మరో కొత్తరకం ట్యాక్స్...! ఈ వివరాలు తెలుసుకోండి

కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా..? తెరపైకి మరో కొత్తరకం ట్యాక్స్...! ఈ వివరాలు తెలుసుకోండి

కొత్త వాహనాల విషయంలో తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ విధించాలని నిర్ణయించింది. ఇందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… త్వరలోనే సవరణ బిల్లు అసెంబ్లీ ముందుకు రాబోతుంది. శాసనసభ ఆమోదం తర్వాత… ఈ కొత్త సెస్ అమల్లోకి వస్తుంది.

కొత్త వెహికిల్స్ పై రోడ్డు భద్రతా సెస్...! (image source unsplash)

కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా…? అయితే మీరు మరో కొత్త ట్యాక్స్ కట్టేందుకు సిద్ధం కావాల్సిందే…! ప్రస్తుతం ఉన్న వెహికిల్ లైఫ్‌ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఇలా అనేక పలు రకాల ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటికి తోడుగా మరో ట్యాక్ రాబోతుంది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై రోడ్డు భద్రతా సెస్(రోడ్ సెఫ్టీ ట్యాక్స్) విధించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ కొత్త ప్రతిపాదనకు సర్కార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ట్యాక్స్ అమల్లోకి రావాలంటే… చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే అంశంపై ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత… ఈ ట్యాక్స్ ను అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది.

ఈ కొత్త ట్యాక్స్ నిర్ణయం అమల్లోకి వస్తే…. వాహన రకాన్ని బట్టి ట్యాక్స్ మారుతుంది. కనిష్ఠంగా రూ.2 వేలు ఉంటుందని తెలుస్తోంది. గరిష్ఠంగా రూ.10 వేల వరకు రోడ్డు భద్రత సెస్ కింద వసూలు చేస్తారు. ఈ సెస్సును కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే వసూలు చేయాలని రవాణాశాఖ ప్రతిపాదించింది.

రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాల మేరకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు రవాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యల అమలు కోసం ఈ సెస్ ను ప్రతిపాదిస్తున్నట్లు తెలుపుతున్నాయి. ఇలా వచ్చే ఆదాయాన్ని రోడ్డు భద్రతా కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే సూచనలున్నాయి.

అన్ని రకాల వాహనాలకు కాకుండా… కొన్నింటికి మాత్రమే ఈ ట్యాక్స్ ను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు వినియోగించే వాహనాలతో పాటు ఆటో కార్మికుల జీవనోపాధికి ఉపయోగించే వాహనాల్ని ఈ ట్యాక్స్ నుంచి మినహాయించే అవకాశం ఉంది. రవాణాశాఖ అధికారికంగా విడుదల చేసే వివరాల తర్వాత… ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రజలపై భారం అత్యంత దారుణం - కేటీఆర్

ఈ కొత్త ట్యాక్స్ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు.

“రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణం. హైడ్రా వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య. రహదారి భద్రతా సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రెండు నుంచి పదివేల వరకూ అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతికి చెందిన ప్రజానీకాన్ని దగా చేయడమే” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“రెండేళ్లు కావస్తున్నా ఇవ్వాల్సిన గ్యారెంటీలను గాలికొదిలేసి, చివరికి ప్రజల నుంచే ముక్కుపిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్రచేస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరు. పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి మరీ వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలి” అని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం