Miss World pageant : 140 దేశాల నుంచి కంటెస్టెంట్ల రాక..! హైదరాబాద్ వేదికగా 'మిస్ వరల్డ్ పోటీలు' - 10 ముఖ్యమైన అంశాలు-telangana to host 72nd miss world pageant key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miss World Pageant : 140 దేశాల నుంచి కంటెస్టెంట్ల రాక..! హైదరాబాద్ వేదికగా 'మిస్ వరల్డ్ పోటీలు' - 10 ముఖ్యమైన అంశాలు

Miss World pageant : 140 దేశాల నుంచి కంటెస్టెంట్ల రాక..! హైదరాబాద్ వేదికగా 'మిస్ వరల్డ్ పోటీలు' - 10 ముఖ్యమైన అంశాలు

మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. 140 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీ పడనున్నారు. తెలంగాణ సాంస్కృతిక, వైభవం, సంప్రదాయలతో పాటు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి వచ్చిందని మంత్రి జూప్లలి చెప్పారు.

హైదరాబాద్‌ : మిస్ వరల్డ్ పోటీల ప్రీ-ఈవెంట్‌లో మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా (PTI)

తెలంగాణ వేదికగా(హైదరాబాద్) మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి 31వ తేదీ వరకు…72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలిరానున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అందం, ప్రతిభను చాటడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయలతో పాటు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని… విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి….

మిస్ వరల్ట్ పోటీలు - ముఖ్యమైన అంశాలు:

  1. 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణకు వేదిక కానుంది. మే 7వ తేదీ నుంచి 31వ తేీదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. ‘తెలంగాణ… జరూర్‌ ఆనా’ (తెలంగాణకు తప్పక రండి) అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
  2. అందాల పోటీల ప్రారంభ కార్యక్రమం మే 10వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఉంటుంది. మే 31వ తేదీన హైటెక్స్‌లో ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలి రానున్నారు.
  3. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్‌లతో ఈవెంట్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విస్తృతమైన అంతర్జాతీయ మీడియా కవరేజీ, లక్షలాది మంది ప్రపంచ వీక్షకులతో ఈ ఫెస్టివల్ హైలెట్ కాబోతుందని వివరించారు. ఈ పోటీల్లో భాగంగా… గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో 72వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ పోటీల పోస్టర్‌ తో పాటు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మిస్ట వరల్డ్ (2024) క్రిస్టినా పిజ్కోవా హాజరయ్యారు.
  4. ఈ కార్యక్రమం ద్వారా గ్లోబర్ టూరిజంతో పాటు ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్ గా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక వైభవం, సంప్రదాయలతో పాటు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి వచ్చిందని చెబుతోంది.
  5. మే 31న హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలేకు ముందు జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పోటీదారులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది.
  6. ఈ పోటీల్లో భాగంగా బుద్ధవనం, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. మెడికల్ అవేర్ నెస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ప్రధాన ఆస్పత్రులను సందర్శిస్తారు.
  7. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే జరగనుంది. కాంటినెంటల్ గ్రూపుల్లో కంటెస్టెంట్లను జడ్జ్ చేసే కాంటినెంటల్ ఫినాలే మే 20, 21 తేదీల్లో టీ-హబ్లో జరగుతుంది.
  8. మే 22న శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న ఐఎస్ బీలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ జరుగుతాయి. మే 24న హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే, 25న జువెలరీ అండ్ పెర్ల్ షో నిర్వహించనున్నారు. ఫైనల్ గా మే 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే జరగనుండగా, విజేతకు కిరీటం దక్కుతుంది.
  9. మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారని… రాష్ట్ర ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం చెల్లించకపోవడమేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేస్ కోసం రూ.46 కోట్లు ఖర్చు చేస్తే కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కానీ రూ.200 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మిస్ వరల్డ్ పోటీ నిర్వహించడం కరెక్టేనా..? అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
  10. మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందన్న ఆరోపణలను పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తోసిపుచ్చారు. ప్రభుత్వం కేవలం రూ.27 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందని… ఈ కార్యక్రమానికి వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం కార్పొరేట్ స్పాన్సర్షిప్స్ నుంచే వస్తున్నాయని ఆమె గురువారం మీడియా సమావేశంలో చెప్పారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.