TG TET 2024 Notification: నేడు తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, ఏటా రెండు సార్లు నిర్వహణ-telangana tet 2024 notification released today held twice a year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet 2024 Notification: నేడు తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, ఏటా రెండు సార్లు నిర్వహణ

TG TET 2024 Notification: నేడు తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, ఏటా రెండు సార్లు నిర్వహణ

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 04, 2024 07:52 AM IST

TG TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఈ ఏడాది రెండో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు చేసింది.

నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

TG TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 నోటిఫికేషన్ సోమవారం విడుదల అవుతుంది. టెట్‌ నోటిఫికేషన్‌ జారీ కోసం పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో పేర్కొంది.

ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు టెట్‌ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. రెండో టెట్‌ పరీక్షను నవంబరులో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తామని ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది రెండో టెట్‌ నిర్వహణ కోసం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 2025 జనవరిలో ఆన్లైన్లో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలకు సుమారు 2.35 లక్షల మంది తెలంగాణ టెట్‌ పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన వారిలో 1.09 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు.

తెలంగాణలో ఇప్పటికే డీఎస్సీ పరీక్ష నిర్వహణ ముగియడంతో పరీక్షకు హాజరయ్యే రాసే వారి సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని భావిస్తుండటంతో ఆన్ లైన్ పరీక్షల కోసం టెస్టింగ్ సెంటర్లు వరుసగా వారం పది రోజుల పాటు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.

కంప్యూటర్ టెస్టింగ్ సెంటర్లు అందుబాటులో ఉండే దానిని బట్టి టెట్ పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల అందుబాటులో ఉండే దానిని బట్టి సంక్రాంతికి ముందు నిర్వహించాలా, తర్వాత అనేది నిర్ణయిస్తారు.

తెలంగాణ టెట్ పేపర్- 1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఉన్న వారు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేం దుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయ నియమాకాలకు టెట్ పరీక్షను అమలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వ హించారు.

తాజా నోటిఫికేషన్‌తో కలిపి పదోసారి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆరుసార్లు పరీక్షలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు టెట్ నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి…

Whats_app_banner