Telangana Formation Day Celebrations 2024 : నీళ్లు, నిధులు, నియమాకాలు... ఇదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్..! ఈ నినాదాలే ఉద్యమానికి ప్రాణం పోశాయి. నాటి నుంచి మొన్నటి మలి దశ తెలంగాణ పోరాటం వరకూ ఈ నినాదమే ప్రత్యేక ఉద్యమ పోరాటానికి ఊపిరైంది.
రాష్ట్ర సాధనలో ఎన్నో పార్టీలు తెరపైకి వచ్చాయి, కానీ కాలగర్భంలో కలిసిపోయాయి. వ్యక్తులు వచ్చారు. వ్యవస్థలో కలిసిపోయారు. కానీ కొందరు బుద్ధిజీవుల పోరాటం ఆగలేదు.. వారి గొంతులను ఆపలేదు. ఎక్కడో ఒక చోట... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని చెబుతూనే వచ్చారు. నిత్యం భావజాలవ్యాప్తికి కృషి చేశారు. విద్యార్థి లోకాన్ని తట్టిలేపారు. పోరాటం ఎగిసిపడకపోవచ్చు కానీ.. తెలంగాణ వాదాన్ని మాత్రం సజీవంగా బతికించే ప్రయత్నం చేశారు.
ఓవైపు దశాబ్ధాలకు పైగా కాలం గడిచిపోయింది. అమరవీరుల స్మృతులు మాత్రమే మిగిలిపోయాయి. కానీ ఇక్కడి ప్రజల ఆకాంక్ష మాత్రం అలాగే ఉండిపోయింది. కానీ టీఆర్ఎస్ ఏర్పాటుతో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఊవ్వెత్తున ఎగిసిపడింది. ఊరు వాడ ఒక్కటై ముందుకుసాగింది. ప్రజల ఆకాంక్షతో దిగివచ్చిన నాటి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1969 ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. నాడు జరిగిన కాల్పుల్లో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. ఇదే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. ఫలితంగా ఉద్యమం మరితం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ రాజకీయ ఒత్తిళ్లు, జాతీయ పరిస్థితుల కారణంగా ఉద్యమం చల్లబడింది.
ఆ తర్వాత కూడా ఇక్కడ మేథావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పలు ప్రాంతీయ శక్తులు... ప్రత్యేక తెలంగాణ ఆవశ్యతను గుర్తు చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూ వచ్చాయి. ఓవైపు జలదోపిడీపై వాస్తవాలను ప్రజలు ముందు ఉంచే ప్రయత్నం చేశాయి. పలువురు ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసినప్పటికీ విజయవంతం కాలేకపోయారు.
2001లో టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధనే అజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)ని ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేవలం ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాదని భావించిన కేసీఆర్.. రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల భర్తీ సమయంలో ఫ్రీజోన్ పై సుప్రీం తీర్పునిచ్చింది. సరిగ్గా ఈ పరిణామమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినట్లు అయింది. ఉద్యోగుల నిరసనలతో ఊపందుకుంది. 2009 ఫలితాలతో పూర్తిగా డీలాపడిపోయిన కేసీఆర్... రీఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 2009 నవంబర్ 27న అమరణ దీక్షకు సిద్ధమయ్యారు. తరువాత కేసీఆర్ అరెస్ట్.. ఖమ్మం తరలింపు.. హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను కంటిన్యూ చేశారు. ఓ వైపు విద్యార్థి లోకం భగ్గుమంది.. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఎల్బీ నగర్ లో శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నారు. పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం… తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న ప్రకటన చేసింది.
ఆ తరువాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇలా 2014 వరకు వెళ్లింది. మధ్య కాలంలో తలపెట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె ఉద్యంలో కీలక ఘట్టాలుగా చెప్పొచ్చు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు.
తెలంగాణ బిల్లుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశలో చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదముద్ర పడలేదు. కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ మేరకు గెజిట్ విడుదలైంది. నాటి నుంచి జూన్ 2ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం అన్నిశాఖలు ఏర్పాట్లు చేశాయి. ఇవాళ జరిగే కార్యక్రమాలు ఏంటో ఇక్కడ చూడండి….
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. దశాబ్ధి వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు