ED IT Raids in Telangana: ఇటు సిట్, అటు ఐటీ... అసలు టార్గెట్ ఏంటి..?-telangana state politics appear intertwined with investigation agencies
Telugu News  /  Telangana  /  Telangana State Politics Appear Intertwined With Investigation Agencies
తెలంగాణలో విచారణ సంస్థల దూకుడు
తెలంగాణలో విచారణ సంస్థల దూకుడు

ED IT Raids in Telangana: ఇటు సిట్, అటు ఐటీ... అసలు టార్గెట్ ఏంటి..?

24 November 2022, 6:12 ISTHT Telugu Desk
24 November 2022, 6:12 IST

ED IT Raids in Telangana: తెలంగాణలో దర్యాప్తు సంస్థల టైం నడుస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ ఇన్విస్టిగేషన్ జరుగుతుండగా.. మరోవైపు ఐటీ, ఈడీ దూకుడు పెంచేశాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే ఈ దాడులు ఎక్కడి వరకు వెళ్తాయి..? అసలు టార్గెట్ ఏంటన్న చర్చ జోరందుకుంది.

Raids in Telangana: ఈడీ... ఐటీ రైడ్స్.... ప్రస్తుతం తెలంగాణలో ఎటుచూసిన ఇదే డిస్కషన్..! ఓవైపు బీజేపీ నేతలే టార్గెట్ గా సిట్ ముందుకెళ్తుండగా... ఇదే సమయంలో ఐటీ, ఈడీలు ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చేశాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ గా దాడులపర్వం కొనసాగుతోంది. మంత్రులతో మొదలైన ఈ రైడ్స్... ఎక్కడి వరకు చేరుతాయో అర్థం కావటం లేదు. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కూడా దూసుకెళ్తోంది. ఏ ఒక్కర్నీ వదిలే ప్రస్తక్తే లేదన్నట్లు సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ సోదాలు.. ఏటువైపు వెళ్తాయి...? ఫలితంగా ఏం జరగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జీఎస్టీ సోదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమదైనశైలిలో స్పందిస్తూంటే... టీ కాంగ్రెస్ నేతల వాదన మరోలా ఉంది.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోయాయి. సీన్ కట్ చేస్తే... బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్... పీక్స్ కు చేరింది. ఓవైపు ఉపఎన్నికకు పోలింగ్ జరగకముందే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపింది. ఓవైపు మునుగోడుకు ముందే లిక్కర్ కేసు... తెలంగాణ రాజకీయాలను హీట్ ఎక్కించింది. ఇందులో పలువురు టీఆర్ఎస్ నేతల పేర్లు రావటం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా నడుస్తున్న క్రమంలో... ఎమ్మెల్యేల ఎర కేసు సరికొత్త పరిణామాలకు దారి తీసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్... ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ కు నోటీసుల వ్యవహరం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చే పనిలో సిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఒక్కసారిగా ఈడీ, ఐటీ రైడ్స్ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. మంత్రి గంగులతో మొదలైన దాడులు... మంత్రి మల్లారెడ్డి ఇంటి వరకు చేరాయి. మరికొందరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారనే చర్చ నడుస్తోంది.

ఈ రైడ్స్ పై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. మునుగోడు ఓట‌మిని జీర్ణించుకోలేక‌నే రాజ్యాంగ సంస్థ‌ల‌ను రాజ‌కీయ సంస్థ‌లుగా వాడుకుంటోందని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. తమ పార్టీ నేతలను బీజేపీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ, ఐటీ దాడులకు భయపడమని చెబుతున్నారు. ఇక బీజేపీ నేతల వాదన మరోలా ఉంది. చట్టబద్ధంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ ఏర్పాటు చేసి.. బీజేపీని టార్గెట్ చేస్తోందని మండిపడుతున్నారు. ఎవరో సంబంధం లేని వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం... తమ పార్టీకి చెందిన జాతీయ నేతలను విచారణకు పిలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి తప్పులు చేయకపోతే ఐటీ, ఈడీ దాడులకు టీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే ఎమ్మెల్యేల ఎర కేసును తెరపైకి తీసుకువచ్చారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తాజా పరిస్థితులు చూస్తుంటే... కేంద్రం వర్సెస్ స్టేట్ అన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఓవైపు నేతల డైలాగ్ లు... మరోవైపు దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచేస్తున్నాయి. అయితే వీటిపై తెలంగాణ కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సీన్ లో లేకుండా చేసేందుకే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆడుతున్న డ్రామా అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ జోడో యాత్ర నడుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేల ఎర కేసు తెరపైకి తీసుకువచ్చారని..ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని చెబుతున్నారు. లిక్కర్ కేసులో పలువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈడీ, సీబీఐ... ఎమ్మెల్సీ కవితపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలనే ఆలోచనతో బీజేపీ, టీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయని చెబుతున్నారు. ఇరు పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని... త్వరలోనే తాము ప్రజల్లోకి వెళ్తామని చెబుతున్నారు.

మొత్తంగా దర్యాప్తు సంస్థల దండయాత్ర ఎటువైపు వెళ్తోందనేది మాత్రం అర్థంకాని పరిస్థితి. ఎన్నికల నాటి వరకు కూడా ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటాయా..? కీలక నేతల అరెస్ట్ ల పర్వం ఉంటుందా..? అలాకాకుండా నోటీసులు, విచారణ వరకే పరిమితవుతుందా..? అనేది చూడాలి. మరోవైపు తాజా పరిస్థితులపై అనేక కోణాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.