TS SSC Exams 2023 : పది విద్యార్థులకు గుడ్ న్యూస్... పరీక్ష కేంద్రాలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం
TS SSC Exams 2023: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. పరీక్షల తేదీల్లో విద్యార్థులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Telangana SSC Exams 2023: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. విద్యార్దులు హాల్ టిక్కెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. పరీక్షల నేపథ్యంలో… బస్సుల సంఖ్యను కూడా పెంచినట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సెంటర్లను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఉదయం 08.45 నిమిషాల వరకు సెంటర్లకు చేరేలా ఏర్పాట్లు చేశామని… తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులు రిటర్న్ అయ్యేలా కూడా బస్సులు తిపుతామని అధికారులు వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా ఈ సేవలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం పరీక్షల తేదీల్లో మాత్రం ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. సెలవు దినాల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ…. ఆ రోజు కూడా ఫ్రీగా విద్యార్థులు ప్రయాణించవచ్చని వివరించారు.
ఈ ఏడాది జరగబోయే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు హాజరుకానున్నారు పరీక్షల నిర్వహణ కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటలకు వరకు జరుగుతాయి. ఇక ఈ ఏడాది పరీక్షలు వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించారు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది.
ఏప్రిల్ 3 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4 - సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
ఏప్రిల్ 8 - గణితం
ఏప్రిల్ 10 - సైన్స్
ఏప్రిల్ 11 - సోషల్ స్టడీస్
ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8న ఆంగ్లం, ఏప్రిల్ 10న గణితం, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్ష జరగనుంది. ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి కూడా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
సంబంధిత కథనం