Telangana Electric Power : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం - ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు-telangana sets a new record with the consumption of 15752 megawatt units of power in a single day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Electric Power : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం - ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు

Telangana Electric Power : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం - ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 06, 2025 10:00 PM IST

Telangana Electric Power : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. వేసవి పూర్తిస్థాయిలో రాకముందే ఇవాళ రికార్డు వినియోగం జరిగింది. ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

 విద్యుత్ వినియోగం
విద్యుత్ వినియోగం (image source unsplash.com)

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదు కాగా… ఈసారి ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో వినియోగం పెరిగింది.

సిద్ధమవుతున్న పంపిణీ సంస్థలు…!

ఈ క్రమంలో 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ ఏర్పడినా.. దానిని తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందంటున్నారు.

గతంతో పోలిస్తే విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడం, ప్రత్యేకంగా వేసవి ముందే పీక్ డిమాండ్‌ నమోదుకావడం ప్రభుత్వానికి, విద్యుత్ పంపిణీ సంస్థలకు సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ… చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పలు మార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. వేసవిలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని… డిమాండ్ కు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు.

విద్యుత్ రంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా, సాగునీటి కోసం రైతులకు, పరిశ్రమలకు, రోజువారీ అవసరాలకు ప్రజలకు నిత్యం నిరంతర విద్యుత్ అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అప్పుడే ఎండలు:

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా భానుడి భగభగలు ఉంటున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు.

రాష్ట్రంలో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తాజా బులెటిన్ లో తెలిపింది. మరో వారం రోజులపాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని అంచనా వేసింది. అయితే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గృహాల్లో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. అప్పుడే ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు పని చెబుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది..!

Whats_app_banner

సంబంధిత కథనం