TGSRTC Employees : నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. కారణాలు ఇవే!
TGSRTC Employees : తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని.. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. సోమవారం నాడు సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ సమ్మెకు దిగనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం బస్ భవన్‌లో సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది.

సత్తా చూపిద్దాం..
ఆర్టీసీలో కార్మికుల హక్కులు హరిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. ఈ తరుణంలో.. హక్కుల సాధనకై, రావాల్సిన ఆర్ధిక, ఇతర అంశాల కోసం సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. 'మన కోసం, మన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో.. మనమే పాల్గొనకపోతే.. మన బానిసత్వానికి మనమే కారణం అవుతాం. పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్లు తప్ప. చరిత్ర సృష్టిద్దాం. ఆర్టీసీ కార్మికుల సత్తా మళ్లీ ఓసారి చూపిద్దాం' అని జేఏసీ పిలుపునిచ్చింది.
కదలి రండి..
'ఓ వైపు ప్రైవేటు పరం లేదు.. కాదు అంటూనే.. ఎలక్ట్రిక్ బస్సులను తెప్పలుగా తెస్తున్నారు. డ్రైవర్లను తిప్పలు పెడుతున్నారు. నీ భద్రతనే కరువవుతున్న సందర్భంలో కలసిరా.. చక్రాన్నిపట్టి ప్రగతి పథాన నిలిపే ఓ డ్రైవరన్నల్లారా.. నీ బ్రతుకు చక్రం బంగారు పథంలో ఉండాలంటే.. బయలుదేరి రా. ఉద్యోగ పర్వంలో అనుక్షణం అభద్రతా, అవమానాలు. కేసుల రూపంలో ఉద్యోగ ఉనికికే ప్రమాదం, ఉద్యోగ భద్రత ఊసే లేని రోజుల్లో కష్టపడే కండక్టరన్నల్లారా.. కదలిరండి. కార్మిక హక్కులకై కలసి రండి' అని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
హామీలు ఎన్నో..
'సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాదు.. రిటైర్డ్ అయిన వారి సమస్యలు ఇంకాతీరనే లేదు.పెండింగ్‌లో బకాయిలు, అడుగు పడని పేస్కేళ్లు, చెల్లించని సీసీఎస్ బకాయిలు, డీఏ బకాయిలు, యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు' అని ఆర్టీసీ జేఏసీ వ్యాఖ్యానించింది.
హక్కుల సాధన కోసం..
'హామీల అమలు, హక్కుల సాధన కోసం 27.01.25న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బస్ భవన్‌లో సమ్మె నోటీసు ఇస్తున్నాం. మునిగిపోయే స్థితిలో ఉన్న మన బతుకులు మనమే దిద్దుకోవాలి. ముందుకు రండి.. మన సత్తా మరోసారి చూపాలి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. అందరం ఒక్కటై రావాలి.. ఆశయాల సాధనకై పోరాడాలి' అని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.