TGSRTC Offer : తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. ఆ బస్సుల్లో 10 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే
TGSRTC Offer : ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ఇచ్చింది. ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ కల్పిస్తోంది. అయితే దానికి మెట్రో బస్ పాస్ ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణ తోపాటు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ వినియోగదారులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ దగ్గర ఉన్న బస్ పాస్‌తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణించవచ్చని.. వాటి టికెట్‌లో 10 శాతం రాయితీని ఇస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
మెట్రో ఎక్స్ ప్రెస్ తోపాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు ఈ రాయితీని పొందవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్‌లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్‌లో సొంతూళ్లకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చని అధికారులు వెల్లడించారు. బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామని.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
కార్తీకమాసం సందర్భంగా..
కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుందన్న దృష్ట్యా, ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట వంటి ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడిపే ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు.
కార్తీకమాసం పర్వదినాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే తమ లక్ష్యమని సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, సోమవారాలు మరియు ఆదివారాల్లో శైవ క్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఆ రోజుల్లో ఈ ప్రత్యేక బస్సుల సంఖ్యను తగినట్లుగా పెంచినట్లు వివరించారు.