TGSRTC Special Buses : సంక్రాంతి పండగ రద్దీ.. 1740 ప్రత్యేక బస్సులు నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ
TGSRTC Special Buses : సంక్రాంతి పండగ వస్తోంది. దీంతో వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న వారు సొంతూళ్లకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సహా.. ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
రాష్ట్రంలో ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగ, వ్యాపారం చేస్తూ స్థిరపడిన వారు.. సంక్రాంతికి సొంతూళ్ల బాట పడతారు. ఇటు ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు ఈ నెల 11 నుంచి సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
రద్దీకి తగ్గట్టు..
పెరిగే రద్దీకి అనుగుణంగా సర్వీసులు ఏర్పాటు చేయడానికి కరీంనగర్ రీజియన్‌లో ఆర్టీసీ అధికారులు సిద్ధం అవుతున్నారు. కరీంనగర్ రీజియన్ నుంచి ఈ నెల 7వ తేదీ నుంచి 22 వరకు అదనపు బస్సులు నడపాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి 13వ తేదీ వరకు జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 770 బస్సులు, కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు 16వ తేదీ నుంచి 22 వరకు 970 అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
కరీంనగర్ రీజియన్‌లో..
ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 860కి పైగా బస్సులతోపాటు.. ఇతర డిపోల నుంచి బస్సులు తెప్పిస్తున్నారు. ఉన్న వాటిని అదనపు ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ సర్వీసుల్లో ఛార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేయనున్నారని తెలుస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా చూడటానికి.. జేబీఎస్‌తోపాటు.. రీజియన్‌లోని అన్ని డిపోల పరిధిలోని రద్దీ ఉండే బస్సు స్టేషన్లలో డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది పర్యవేక్షించనున్నారు.
రిజర్వేషన్ చేసుకోవచ్చు..
సంక్రాంతి సందర్భంగా అదనపు ఆర్టీసీ బస్సుల్లోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఇందుకోసం www.tgsrtcbus.in ను సందర్శించాలని అధికారులు సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ నుంచి మొత్తం 1,740 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
50 శాతం అదనంగా..
ప్రత్యేక బస్సులు నడపడంపై హర్షం వ్యక్తం అవుతున్నా.. 50 శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేయబోతున్నారనే దానిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ అదనంగా 50 శాతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సంస్థ పురరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదనపు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.