TSRTC Lahari Buses: తెలంగాణలో “లహరి” స్లీపర్‌ సర్వీస్ బస్సులు ప్రారంభం-telangana road transport corporation started sleeper bus services to long distance journeys
Telugu News  /  Telangana  /  Telangana Road Transport Corporation Started Sleeper Bus Services To Long Distance Journeys
లహరి స్లీపర్ బస్సుల్ని ప్రారంభించిన మంత్రిఅజయ్, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ
లహరి స్లీపర్ బస్సుల్ని ప్రారంభించిన మంత్రిఅజయ్, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ

TSRTC Lahari Buses: తెలంగాణలో “లహరి” స్లీపర్‌ సర్వీస్ బస్సులు ప్రారంభం

27 March 2023, 13:49 ISTHT Telugu Desk
27 March 2023, 13:49 IST

TSRTC Lahari Buses: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం లహరి అమ్మఒడి స్లీపర్ బస్సుల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసి ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జన్నార్,రవాణమంత్రి అజయ్ తదితరులు కొత్త బస్సు సర్వీసుల్ని ప్రారంభించారు.

TSRTC Lahari Buses: సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కూడిన ఆర్టీసి కొత్త ఏసీ స్లీపర్ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సర్వీసులకు 'లహరి-అమ్మఒడి అనుభూతి'గా నామకరణం చేశారు.

కొత్త బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయంతో కూడిన ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్‌ బస్సులకు హైటెక్‌ హంగులు జోడించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తారు. ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. ఇటీవల ప్రారంభించిన 12 నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరిగానే వీటికీ 'లహరి- అమ్మఒడి అనుభూతి'గా సంస్థ నామకరణం చేశారు. ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్బళ్లి మార్గాల్లో వీటిని నడపనున్నట్లు సంస్థ తెలిపింది.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది.

ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టిఎస్ ఆర్టీసి ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

లహరి బస్సు ప్రత్యేకతలివే..

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.

వీటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులో రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేబిన్‌లో, బస్సు లోపల వీటిని ఏర్పాటు చేశారు. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఏర్పాటు చేశారు.

టాపిక్