TS Covid Cases : తెలంగాణలో మరో 9 మందికి కొవిడ్ - 27కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
Covid Cases in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కొత్తగా 9 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 27 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైదారోగ్యశాఖ ప్రకటించింది.

Covid Cases in Telangana : తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో శుక్రవారం 1,245 మందికి పరీక్షలు నిర్వహించగా… తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 27కు చేరనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 8 హైదరాబాద్‌లో నమోదు కాగా… ఒకటి రంగారెడ్డి జిల్లాలో తేలినట్లు ప్రకటించింది.
AP Covid Cases: మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల్లో.. ఏలూరులో ఒక కరోనా పాజిటివ్ నమోదయ్యింది. కొత్త వేరియంట్ అలర్ట్‌తో ఆరుగురికి ర్యాండమ్‌గా టెస్ట్‌లు నిర్వహించారు. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ గా పాజిటివ్‌గా తేలింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు.
సీఎం జగన్ ఆదేశాలు
ఏపీలో కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు.గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ టెస్టులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ పలు ముఖ్యాంశాలను తెలిపింది. కొవిడ్ కొత్త వేరియంట్ JN.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ వేరియంట్ సోకినవారు కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు JN.1కు లేవని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,741 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో శుక్రవారం 640 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దాంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,669 నుండి 2,997 కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడినవారి సంఖ్య 4.50 కోట్లకు పైగా ఉంది. అలాగే, కోవిడ్ 19 తో మరణించిన వారి సంఖ్య 5,33,328కి చేరుకుంది. అలాగే, రికవరీల సంఖ్య 4,44,70,887కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.81% గా ఉంది. మరణాల రేటు 1.19% వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.