తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి...మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులని మెసేజ్ లు పంపిస్తుంది.
కొత్త కార్డులు పొందిన వారు చౌక ధరల దుకాణాల నుంచి మే నెల రేషన్ బియ్యం పొందవచ్చని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు నెంబర్ తో పాటు మెసేజ్ లు పంపామని, వారు తమ కార్డు స్టేటస్ ను తనిఖీ చేయవచ్చని చెప్పారు.
కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న మీ సేవాలో ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.
రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఏళ్లుగా రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. మార్పు, చేర్పులు చేసుకున్న వారి వివరాలను కొత్త కార్డుల్లో యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు https://epds.telangana.gov.in/FoodSecurityAct వెబ్ సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
మీసేవా కేంద్రాలు, ప్రజా పాలన, గ్రామ సభలు, కుల గణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, ఎక్కడైనా రేషన్ షాపుకు వెళ్లి సరకులు పొందవచ్చని పేర్కొన్నారు. కొత్తకార్డులకు ఈ నెల నుంచి రేషన్ సరుకులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
సంబంధిత కథనం