TG Rains : తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం, ఏడుగురి దుర్మరణం!-telangana rains havoc heavy gusty air uprooted trees 7 died due to heavy gale ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rains : తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం, ఏడుగురి దుర్మరణం!

TG Rains : తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం, ఏడుగురి దుర్మరణం!

Bandaru Satyaprasad HT Telugu
May 26, 2024 06:42 PM IST

TG Rains : తెలంగాణలో ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు బీభత్సానికి ఏడుగురు మృతి చెందారు.

తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం, ఏడుగురి దుర్మరణం!
తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం, ఏడుగురి దుర్మరణం!

TG Rains : తెలంగాణలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో ఏడుగురు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్(12) మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి రామ్ రెడ్డి మృత్యువాత పడ్డారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

షెడ్డు కూలిన ఘటనలో నలుగురు మృతి

నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మరణించారు. తాడూరు సమీపంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో షెడ్డు యజమాని మల్లేష్‌, పదేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలో ఈదురుగాలులకు తిమ్మాయిపల్లి- శామీర్‌పేట్‌ దారిలో చెట్టు కూలి బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. బైక్ పై చెట్టు విరిగిపడటంతో నాగిరెడ్డి రామ్‌రెడ్డి ఘటనాస్థలిలోనే మృతి చెందగా, ధనుంజయకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం ధనుంజయను ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ధనుంజయ మృతి చెందాడు. మృతులది యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామం అని తెలుస్తోంది.

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో ఈదురుగాలుల దాటికి చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, మల్కాజిగిరి, తుర్కయంజాల్‌ ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. హయత్ నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, పెద్దఅంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల దాటికి పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో ఈదురుగాలులు, వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. దిగివ ట్రోపోస్పిరిక్ పశ్చిమ నైరుతి గాలులు ఏపీ, యానాం మీదుగా వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దూసుకొస్తున్న రెమల్ తుపాను, ఏపీలో వర్షాలు

బంగాళఖాతంలో రెమల్ తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఆరు గంటల్లో రెమల్ తుపాను తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రెమల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ ఉండనుంది. ఇప్పటికే ఈ తుపాను వల్ల పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లా యంత్రంగాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుపాను‌గా బలపడింది. దీంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి.

సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను కెరటాలు ముంచుతున్నాయి. తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో నీటిమట్టం పెరిగింది. దీంతో మత్స్యకారులు భయాందోళనలో ఉన్నారు. రాకాసి అలలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలలతో పర్యాటకులు ఆటలాడుతున్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలను జారీ చేశారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి ఈదురు గాలులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి కొనసాగుతోంది. దీంతో బీచ్ రోడ్డులో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.

మరోవైపు తుఫాన్ నేపథ్యంలో కలకత్తాలో పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. ఇప్పటికే సముద్ర అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సుముద్ర తీరంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను కోరారు. బంగాళాఖాతంతో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఈరోజు ఉదయం తీవ్ర తుఫాన్‌గా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిణి సునందా తెలిపారు. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ.. ఈరోజు (ఆదివారం) రాత్రికి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒరిస్సా దక్షిణాది రాష్ట్రాలపై ఉంటుందని తెలిపారు. కలకత్తా, హుగ్లీ , హౌరా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెమాల్ తుఫాన్ వల్ల 100 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు రాత్రికి సముద్ర తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం