బీసీ రిజర్వేషన్లపై జూలై 17న తెలంగాణలో ‘రైల్ రోకో’.. కల్వకుంట్ల కవిత పిలుపు-telangana rail roko protest obc reservation kavitha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బీసీ రిజర్వేషన్లపై జూలై 17న తెలంగాణలో ‘రైల్ రోకో’.. కల్వకుంట్ల కవిత పిలుపు

బీసీ రిజర్వేషన్లపై జూలై 17న తెలంగాణలో ‘రైల్ రోకో’.. కల్వకుంట్ల కవిత పిలుపు

HT Telugu Desk HT Telugu

ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న తెలంగాణలో రైల్ రోకో నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కవిత (PTI)

వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఈనెల 17న ‘రైల్ రోకో’ ఆందోళన చేపట్టనున్నట్ట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అయితే కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెండింగ్‌లో ఉండటంపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

బిల్లుల ఆమోదం, కేంద్రం అనుమతి కోసం ఎదురుచూపు

తెలంగాణ శాసనసభ ఈ ఏడాది మార్చి 17న రెండు బిల్లులను ఆమోదించింది. వీటి ప్రకారం, విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో, అలాగే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుల కారణంగా రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని మించిపోతుంది కాబట్టి కేంద్రం అనుమతి అవసరం.

కాంగ్రెస్, బీజేపీలపై కవిత ప్రశ్నలు

"రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో (ఓబీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది" అని బీఆర్ఎస్ నాయకురాలు కవిత అన్నారు.

ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆమె కోరారు. "బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది.. నేను ప్రధానమంత్రిని కోరుతున్నా.. ఆయన ఓబీసీ వర్గానికి చెందినవారు. దయచేసి ఈ బిల్లును వీలైనంత త్వరగా తిరిగి పంపేలా చూడాలి" అని ఆమె అన్నారు.

శాశ్వత పరిష్కారం కోసం 'తమిళనాడు మోడల్'

తమిళనాడు మోడల్‌ను అనుసరించవచ్చని, బిల్లు ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కవిత సూచించారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర చట్టాల జాబితా ఉంటుంది. వీటిని కోర్టులలో సవాలు చేయలేరు.

పార్లమెంటు చట్టం ద్వారా లేదా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.