Vehicle Modification : వాహనాలను మాడిఫికేషన్ చేయిస్తున్నారా.. అయితే మీ పని అయినట్టే!-telangana police warns of action against modification of vehicles ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vehicle Modification : వాహనాలను మాడిఫికేషన్ చేయిస్తున్నారా.. అయితే మీ పని అయినట్టే!

Vehicle Modification : వాహనాలను మాడిఫికేషన్ చేయిస్తున్నారా.. అయితే మీ పని అయినట్టే!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 09, 2025 12:15 PM IST

Vehicle Modification : చాలా మంది తమ వాహనానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వడానికి మాడిఫై చేస్తారు. కానీ ఇది చట్ట విరుద్ధం అని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా మాడిఫికేషన్ చేస్తే.. జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు వాహనాలను సీజ్ కూడా చేస్తారు.

బైక్ మాడిఫికేషన్
బైక్ మాడిఫికేషన్ (istockphoto)

స్థానికంగా ఉండే రోడ్లకు అనుగుణంగా, పర్యావరణం, ఇంధన సామర్థ్యాన్ని బట్టి కంపెనీలు వాహనాలను తయారు చేస్తాయి. కానీ.. కొందరు కంపెనీలు తయారు చేసిన వాహనాలను మాడిఫికేషన్ చేస్తుంటారు. ఆకృతులు మార్చి.. తమకు నచ్చిన స్టైల్‌లో మాడిఫికేషన్ చేయించుకుంటారు. ఇది చట్ట ప్రకారం నేరం అని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే.. జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు వాహనాలను సీజ్ చేస్తారు కూడా.

సైలెన్సర్లు మార్చి..

ముఖ్యంగా బైక్‌లను వినియోగించేవారు.. సైలెన్సర్లను మార్చి.. ఎక్కువ శబ్ధం వచ్చేవాటిని బిగించుకుంటారు. ఆ బైక్‌లు రోడ్లపైకి వెళ్లిన సమయంలో ఇతర వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ మధ్య కొందరు నాలుగు చక్రాల వాహనాలను కూడా మాడిఫికేషన్ చేయించుకుంటున్నారు. వాటిల్లో ముఖ్యంగా జీప్‌లను మాడిఫికేషన్ చేసి వినియోగిస్తున్నారు. తనిఖీల సందర్భంగా పోలీసులు ఇలాంటి వాహనాలను గుర్తిస్తున్నారు.

దొరికితే ధ్వంసం..

తనిఖీల సమయంలో మాడిఫికేషన్ చేసిన వాహనాలు దొరికితే.. సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేస్తున్నారు. వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు మాడిఫికేషన్ చేసిన వారిపై 1250కి పైగా కేసులు నమోదు చేశారు. రూ.12 లక్షల వరకు జరిమానా విధించారు. అందుకే.. కంపెనీలు తయారు చేసిన వాటిని మాడిఫికేషన్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

అనుమతి తీసుకోవాలి..

కొన్ని మార్పులకు రవాణా శాఖ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్‌లు, లైట్లను మార్చడం చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇది భద్రతకు ప్రమాదం కలిగిస్తుంది. కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వాహనాలను మాడిఫై చేస్తారు. దీనిలో వీల్‌చైర్ యాక్సెస్, ఇతర మార్పులు ఉంటాయి. వీటికి అనుమతి తీసుకొని చేసుకోవచ్చు.

సౌకర్యం.. అవసరం..

సీట్లు, స్టీరింగ్ వీల్, సస్పెన్షన్ వంటి భాగాలను మార్చడం ద్వారా వాహనం సౌకర్యాన్ని పెంచవచ్చు. కానీ.. ఇందుకోసం అనుమతి తీసుకోవాలి. కొందరు వ్యక్తులు తమ వాహనాలను ఆఫ్ రోడింగ్ కోసం మాడిఫై చేస్తారు. దీనిలో సస్పెన్షన్, టైర్లు, ఇతర మార్పులు ఉంటాయి. వాహనాన్ని మాడిఫై చేయడం అభిరుచి, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చర్యలు తీసుకుంటారు.

Whats_app_banner