TGSP : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం - 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు-telangana police department suspended 39 telangana special police personnels ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsp : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం - 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు

TGSP : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం - 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 27, 2024 08:53 AM IST

తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌(టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. పలు బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు
39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు

తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌(టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్ల పరిధిలో పని చేస్తున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. తొలుత కుటుంబ సభ్యులు నిరసనలు చేయగా… ఇటీవలే నేరుగా కానిస్టేబుళ్లే రోడ్లెక్కారు.  పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి… ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

39 మందిపై వేటు…!

టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ఆందోళనలను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది.   39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తున్నట్లు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని… అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.  సస్పెన్షన్‌కు గురైన వారిలో 3 బెటాలియన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. 17వ బెటాలియన్ లో ఆరుగురు, నాలుగో బెటాలియన్ లో ఆరుగురు, ఐదులో 6, ఆరులో 5, 12లో 5, 13వ బెటాలియన్ లో  ఐదు మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

డీజీపీ సీరియస్…

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ జితేందర్‌ స్పందించారు. క్రమక్షశిణకు మారుపేరైన పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు డీజీపీ జితేందర్‌ శనివారం కీలక ప్రకటన చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కానిస్టేబుళ్లు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలలో పాల్గొన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని డీజీపీ గుర్తుచేశారు.

బెటాలియన్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వివాదాస్పంద కావడంతో ప్రభుత్వం స్పందించి...కానిస్టేబుళ్లపై విధించి సస్పెన్షన్ ఎత్తివేసింది. అలాగే కానిస్టేబుళ్లకు సెలవులపై పాత విధానాన్నే అమలుచేస్తామని హామీ ఇచ్చింది. మొదట నల్గొండలో మొదలైన ఈ వివాదం కరీంనగర్, వరంగల్‌లోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఈ వివాదంపై రోడ్లపైకి వచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Whats_app_banner