TG Police : తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్మహత్యల కలకలం, ఆదేశాలే కాదు ఆత్మస్థైర్యాన్ని నింపాలంటున్న నిపుణులు!-telangana police department constables si suicide incidents experts say to boost self confidence ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Police : తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్మహత్యల కలకలం, ఆదేశాలే కాదు ఆత్మస్థైర్యాన్ని నింపాలంటున్న నిపుణులు!

TG Police : తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్మహత్యల కలకలం, ఆదేశాలే కాదు ఆత్మస్థైర్యాన్ని నింపాలంటున్న నిపుణులు!

TG Police : తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి అధికారులు పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. పని ఒత్తిడి, వేధింపులు, వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత వృత్తిపర సమస్యలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ పోలీస్ శాఖలో ఆత్మహత్యల కలకలం, ఆదేశాలే కాదు ఆత్మస్థైర్యాన్ని నింపాలంటున్న నిపుణులు!

TG Police : తెలంగాణ పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు, ఉన్నతాధికారుల వేధింపులు...కారణాలు ఏమైనా కింది స్థాయి ఉద్యోగుల బలైపోతున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో ఎస్, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మూకుమ్మడి ఆత్మహత్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. శాంతి భద్రతలు, ప్రజల రక్షణలో ముందుండే పోలీసులు గుండె చెదిరి నిలువునా ఉసురు తీసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ఆత్మహత్యలు పోలీస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇటీవల ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్ ఆపరేటర్ మూకుమ్మడి ఆత్మహత్యల ఘటనపై పోలీస్‌ శాఖ సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చే వరకు... ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని, వారి మధ్య ఉన్న సంబంధాలపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నా... ఎందుకు నిఘా పెట్టలేకపోయారని నిలదీసినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీ సింధూశర్మను రాష్ట్ర పోలీసుశాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణకు ఎస్పీ మూడు టీమ్ లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కేసు విచారణకు కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌, సీసీ పుటేజీ, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

బిక్కనూరు ఎస్సై సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోన్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో వీరి మృతదేహాలు గుర్తించారు. ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో గాలింపు చేపట్టగా.. శ్రుతి, నిఖిల్‌, సాయి కుమార్ మృతదేహాలను లభ్యమయ్యాయి. మూకుమ్మడి సూసైడ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

వరుస ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే అవగాహన సదస్సులు పెట్టించాలని పోలీస్ శాఖలో కొందరు సూచిస్తున్నారు. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందులు, పర్యవేక్షణపై పర్సనాలిటీ డెవలప్మెంట్ పై పలు సూచనలు ఇవాలని కోరుతున్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, సమస్యలుంటే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చే పోలీసులు...సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కోల్పోవడం వాస్తవ పరిస్థితులకు అద్ధం పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల టీజీఎస్పీ పోలీసుల ఆందోళనలు చేశారు. సెలవుల విషయంలో ప్రభుత్వం తెచ్చిన సర్కులర్ పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని పోలీసులు రోడ్డెక్కారు. స్పెషల్ పోలీస్ బృందాల్లో క్షేత్రస్థాయి పనిచేసే వారి సంఖ్యను పెంచాలని, వారికి సెలవుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. గతంలో ఉన్న 15 రోజులకు నాలుగు రోజుల సెలవు విధానానికి బదులుగా ఒక నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీలు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు. అవసరమైతే అదనంగా మరికొన్ని రోజులు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేశారు. చివరకు ప్రభుత్వం ఈ సర్క్యులర్ ను వెనక్కి తీసుకుంది.

పని ఒత్తిడి, పనిప్రదేశాల్లో వేధింపులు, వ్యక్తిగత సంబంధాలు.. ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఇటీవల ఘటనలతో నిర్థారణ అవుతోంది. పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకు శాఖపరమైన అవగాహన కార్యక్రమాలు, నిపుణుల మోటివేషనల్ ప్రోగ్రామ్స్ తరచుగా ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత కథనం