Telangana Police : తెలంగాణ పోలీసులంటే ఫైర్.. నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్‌లో ఛేజింగ్!
Telangana Police : ఓ దొంగ అంబులెన్స్‌ను చోరీ చేశాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు యాక్షన్ మూవీ రేంజ్‌లో ఛేజింగ్ చేశారు. దాదాపు గంటన్నర బీభత్సం సృష్టించిన ఆ దొంగ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి గాయాలు అయ్యాయి. ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ చేసిన దొంగ హల్‌చల్ చేశాడు. అంబులెన్స్ చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై సినిమా తరహాలో పోలీసులు ఛేజింగ్ చేశారు. హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని చోరీ చేసి దొంగ పారిపోతుండగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగను అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను దొంగ ముప్పు తిప్పలు పెట్టాడు. అంబులెన్స్ సైరన్‌తో రయ్ రయ్ మంటూ అతి వేగంతో దూసుకెళ్లాడు. అయితే.. ఆ దొంగను పట్టుకునే క్రమంలో పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్సై జాన్ రెడ్డిని దొంగ అంబులెన్స్‌తో ఢీకొట్టి పారిపోయాడు. జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్‌ను ఢీకొట్టి దొంగ పారిపోయాడు. దీంతో సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అటు ఏఎస్సై జాన్ రెడ్డి ధైర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.
అసలు ఏం జరిగింది..
ఖమ్మం జిల్లాకు చెందిన అతను.. హయత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. మళ్లీ ఖమ్మం వెళ్లడానికి ఏకంగా అంబులెన్స్‌నే ఎత్తుకెళ్లాడు. వెంటనే అప్రముత్తమైన అంబులెన్స్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ అంబులెన్స్‌ను పట్టుకునేందుకు ఛేజ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్- విజయవాడ హైవేపై ఉన్న టోల్ గేట్ల వద్ద పట్టుకోవాలనుకున్నారు. కానీ సాధ్యపడలేదు.
చివరికి కేతేపల్లి మూసీ బ్రిడ్జిపై పోలీసులు లారీలను అడ్డుగా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అతను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మూసీ బ్రిడ్జి వద్ద ఉన్న కల్వర్టును ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపైలన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతనికి మతిస్థిమితం లేదని తెలుస్తోంది. అందుకే పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం.