Revanth Reddy : టీఆర్ఎస్ కార్యకర్త నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ వరకూ- రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలెన్నో!
Revanth Reddy Political Journey : రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముక్కుసూటి తనం, ప్రత్యర్థులపై ఎదురుదాడి, పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీపై హెచ్.టి.తెలుగు ప్రత్యేక కథనం.
Revanth Reddy Political Journey : పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే నేర్పు ఆయన సొంతం. కేవలం 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు అయ్యారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్... ఆయన ఏం చేసినా సంచలనమే... విమర్శలైనా, నిరసనలైనా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంటారు. అనుచరులు ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటారు. ఆయనే అనుముల రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో తలపండిన నేతలను దీటుగా ఎదుర్కొంటూ తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు రేవంత్ రెడ్డి.
వ్యవసాయ కుటుంబ నేపథ్యం
అనుముల రేవంత్ రెడ్డి..1969 ఆగస్టు 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లెలో...దివంగత నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్ రెడ్డి... ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియా అనుబంధ కాలేజీలో డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్... పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. దూకుడుగా, చరుకుగా ఉండే రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో మెంబర్ గా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అది విజయవంతం అవ్వడంతో...రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ రెడ్డి.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.
రేవంత్ రాజకీయ ప్రస్థానం
టీడీపీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు రేవంత్ రెడ్డి. 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా.. కూటమి పొత్తు్ల్లో భాగంగా ఆ సీటు రేవంత్ కు రాలేదు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి...2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...దిగ్గజాలు కేసీఆర్, వైఎస్ఆర్ వ్యూహాలను చిత్తుచేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అప్పుడే రేవంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి... తనకు ఎంతో ఇష్టమైన టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్ గా పనిచేసిన రేవంత్ రెడ్డికి... చంద్రబాబు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఓటమి పాలైనా.. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తరపున రేవంత్ బలంగా గొంతు వినిపించేవారు.
యాక్టివ్ లీడర్ గా
టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అయినా రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, టీడీపీలోనే ఉంటే రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగే ఛాన్స్ లేదని భావించిన రేవంత్ రెడ్డి... 2017 అక్టోబర్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డిని... కేసీఆర్ తన అస్త్రాలన్నీ ఉపయోగించి ఓడించారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిటెండ్ గా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల తేడాతో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి... పాదయాత్రలు, పదునైన మాటలు, ప్రత్యర్థి వ్యూహాలను ఛేదిస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ బరిలోనే నిలవాలని రేవంత్ భావిస్తున్నారు.
ఓటుకు నోటు కేసు
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో 2015 ఓటుకు నోటు వివాదం మాయని మచ్చగా నిలిచిపోతుంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఆఫర్ చేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు రేవంత్ రెడ్డి. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి జైలులో ఉండగానే ఆయన కుమార్తె వివాహం జరిగింది. కోర్టు అనుమతి తీసుకుని కుమార్తె పెళ్లికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు, భువనేశ్వరి అన్ని తామై రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం జరిపించారని అంటుంటారు. ఆ తర్వాత ఈ కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది.