TG Panchayat Elections : ఫిబ్రవరి 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
TG Panchayat Elections : ఫిబ్రవరి 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కులగణన సర్వే రిపోర్ట్ సిద్ధం కావడంతో కేబినెట్ లో చర్చించి రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందని సమాచారం.
TG Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన...కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రకటన కోసం క్షేత్రస్థాయిలో నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పార్టీలు, స్థానిక నేతలు ప్రచార కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణమైన ప్రకటన రావొచ్చన్న సమాచారంతో ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.

కులగణన సర్వే రిపోర్ట్ సిద్ధం
కులగణన చేపట్టాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు ముందు నుంచీ చెబుతున్నారు. తాజాగా కులగణన సర్వే నివేదిక సిద్ధమైంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కులగణన సర్వే రిపోర్టును అందుకుంది. కులగణన సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించనున్నారు.
ఈ నెల 5న అసెంబ్లీలో ఈ రిపోర్ట్ ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. అనంతరం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం.
ఎన్నికల ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల నగారా ఎప్పుడైనా మోగించవచ్చన్న సంకేతాలతో.. అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటరు జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్ధం చేశారు. ఒక వైపు కొత్త ఓటర్ల పేర్లను వార్డుల వారీగా నమోదు చేస్తుండగా.. మరోవైపు ఓటరు బ్యాలెట్ పత్రాల ముద్రణకు కసరత్తు ప్రారంభించారు.
బ్యాలెట్ పత్రాల ముద్రణకు అందుకు కావాల్సిన పేపర్లను అధికారులు సరఫరా చేస్తుండగా.. దానిపై గుర్తులు మాత్రం ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రించాలని భావిస్తున్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు నలుగురు, అయిదుగురు, పది మంది ఉన్నట్లు.. ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకొని సిద్ధంగా ఉంచాలా లేక అభ్యుర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.