TS Rains :తెలంగాణలో రాగల రెండ్రోజులు మోస్తరు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
TS Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల రెండ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TS Rains : తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, వరంగల్, సూర్యాపేట, నల్గొండలతో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షం
గత రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్ , ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్ మండలాల్లో భారీగా వర్షం కురిసింది. ఈ కారణంగా వివిధ ప్రాంతాల్లోని నాళాలు డ్రైనేజీలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో నిర్మల్ జిల్లాలో వివిధ మండలాల్లో 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన విధంగా జిల్లాలో వాతావరణం మేఘావృతం అయింది. వర్షం కారణంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులో కొట్టుకొని పోయి ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు పిడుగు పడి మృతి చెందారు. భారీ వర్షం కారణంగా జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టు రెండు గేట్లు తెరిచారు. ప్రాజెక్టులో మొత్తం సామర్థ్యం 239.5 అడుగులు ఉండగా ప్రస్తుతం 239.35 నీటిమట్టం చేరింది. అలాగే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో 700 అడుగుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 699 అడుగుల నీటిమట్టం కలదు. వాతావరణ సూచన మేరకు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.
రిపోర్టింగ్ : కె.వేణుగోపాల్, ఆదిలాబాద్