ముస్లిం ఓబీసీ రిజర్వేషన్లపై రాజకీయ వేడి: బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం-telangana muslim obc quota bjp congress clash ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ముస్లిం ఓబీసీ రిజర్వేషన్లపై రాజకీయ వేడి: బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

ముస్లిం ఓబీసీ రిజర్వేషన్లపై రాజకీయ వేడి: బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

HT Telugu Desk HT Telugu

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగిస్తేనే 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Mohammed Aleemuddin )

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగిస్తేనే 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కులాలు ఎన్నో ఏళ్లుగా ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) జాబితాలో ఉండి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు

ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కులాలు, ఉపకులాలు ఓబీసీ రిజర్వేషన్లు పొందుతున్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 70 ముస్లిం కులాలు, ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చినట్లు వారు వివరిస్తున్నారు. గుజరాత్‌లో బఫన్, డఫర్, ఫకీర్, ఫక్వీర్, గఢై, మియానా, మీర్, దాదీ, లంఘా, మీరాసీ, మజోతి కుంబర్, మజోతి, కుంబర్ దర్బన్ వంటి ముస్లిం కులాలు, ఉపకులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి.

ఇది మాత్రమే కాదు.. 2019లో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిన 10% ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గాలు) రిజర్వేషన్లలో కూడా జనరల్ కేటగిరీలో ఉండి రూ. 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిలో ముస్లింలు కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు. అయితే, ఈ వాస్తవాలన్నింటినీ పట్టించుకోకుండా, బీజేపీ కేవలం రాజకీయం కోసం తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ముస్లిం ఓబీసీల స్థితి

ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీ జాబితాలో ఉన్న 79 కులాల్లో 38 ముస్లిం ఉపకులాలు ఉండటం వాస్తవం కాదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. వాటిలో అన్సారీ, కురేషీ, షేక్, జులాహా వంటి ముస్లిం ఉపకులాలు ఓబీసీ జాబితాలో కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలోనూ ఈ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో దుదేకుల, పింజారీ, కురేషీ వంటి ముస్లిం ఉపకులాలు 1960ల నుంచీ ఓబీసీ కోటాను పొందుతున్నాయని, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా జులాహా, కస్సాబ్, మీరాసీ, మైమల్ వంటి పస్మందా ముస్లిం సముదాయాలు ఓబీసీ రిజర్వేషన్లు పొందుతున్నాయని పీసీసీ మైనారిటీ నేత ఒకరు గుర్తు చేశారు. 2016లో మోదీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో 17 ముస్లిం కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చిందని ఆయన పేర్కొన్నారు.

చారిత్రక సిఫార్సులు, కమిషన్ల నివేదికలు

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడం అనేది హంటర్ కమిషన్, మిల్లర్ కమిటీ, కాకా కాలేల్కర్ కమిషన్ల వంటి చారిత్రక నివేదికలు, సిఫార్సులపై ఆధారపడి ఉందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఈ కమిషన్లు మతం ఆధారంగా కాకుండా సామాజిక, ఆర్థిక, వృత్తిపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించాయని, అన్సారీ (నేత కార్మికులు), కురేషీ, జులాహా (టెక్స్‌టైల్ కార్మికులు), దుదేకుల (పత్తి శుభ్రం చేసేవారు), మెహతర్ (పారిశుద్ధ్య కార్మికులు) వంటి ముస్లిం సమూహాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవిగా గుర్తించారని చెబుతోంది.

తెలంగాణ సమగ్ర కులగణన నివేదిక

తెలంగాణలో ఒక లక్ష మంది సిబ్బందితో 50 రోజులపాటు ఇంటింటికీ తిరిగి 88 కోట్ల పేపర్లలో సేకరించిన సమాచారం ఆధారంగా నిర్వహించిన సమగ్ర కులగణనలో బీసీలు 56.33% ఉన్నట్టు తేలింది. ఇందులో ముస్లిం బీసీలు 10.08% ఉన్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించి, అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపింది.

అయితే, ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తేనే ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు, ముందుగా తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం కులాలు, ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చిన విషయాన్ని గ్రహించాలని వ్యాఖ్యానిస్తున్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.