TG MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా - పావులు కదుపుతున్న పార్టీలు, అభ్యర్థులు..!-telangana mlc elections schedule announced congress is working on the selection of candidates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections 2025 : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా - పావులు కదుపుతున్న పార్టీలు, అభ్యర్థులు..!

TG MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా - పావులు కదుపుతున్న పార్టీలు, అభ్యర్థులు..!

HT Telugu Desk HT Telugu
Jan 30, 2025 06:40 AM IST

Telangana MLC elections 2025: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉత్తర తెలంగాణలో ఫిబ్రవరి 27న కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నాగారా మ్రోగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి 29 తో ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు.

yearly horoscope entry point

మూడు నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న నామినేషన్లను పరిశీలించి, ఉపసంహరణకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఇచ్చారు.‌ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 3లక్షల 41 వేల 313మంది పట్టభద్రుల ఓటర్లు... 25 వేల 921 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించగా 11056 మంది పట్టభద్రులు, 2148 మంది టీచర్లు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.‌ అవి ఓకే అయితే పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 352369 కి చేరనుంది. అలాగే టీచర్ల ఓటర్లు 28069 మంది కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉత్తర తెలంగాణలోని 15 జిల్లాలో పట్టభద్రుల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ల పోలింగ్ కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

కరీంనగర్ లో నామినేషన్ లు..

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరిస్తారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ లు స్వీకరిస్తారు. షెడ్యూల్ వెలువడడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అధికారులతో సమావేశమై నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.‌

ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని, ఎన్నికలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాజకీయ పార్టీల హడావిడి…..

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.‌ బిజెపి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. బిఆర్ఎస్ పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జనభర్జన పడుతుంది. బిజెపి పట్టభద్రుల అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మాల్క కొమరయ్య పేర్లను ఖరారు చేసింది. ప్రచారం మొదలు పెట్టింది.‌

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేసిన ప్రసన్నకుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదివరకే పీసీసీ చీఫ్ నేతృత్వంలో జరిగిన పార్టీ ప్రాతినిధుల సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని తీర్మానించి అధిష్టానానికి పంపించారు. అయితే జీవన్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపని పరిస్థితుల్లో నరేందర్ రెడ్డి పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు.

పోటీకి దూరంగా బిఆర్ఎస్...

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నయం అన్నట్లుగా భావిస్తుంది. ఆ పార్టీ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ టికెట్ ఆశిస్తూ ప్రచారాన్ని చేపట్టారు. అయితే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2018లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో నిలపలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్ కు మద్దతు ఇచ్చింది.

అధికారంలో ఉన్నప్పుడే పోటీలో అభ్యర్థి నిలపకుండా మద్దతిచ్చిన అభ్యర్థి గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రెండు అధికార పార్టీల మధ్య గెలుపు అసాధ్యమని బిఆర్ఎస్ బావిస్తుంది. పార్టీ పరంగా పోటీ చేయకపోవడమే గౌరవంగా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంటుందా ఉండదా అనే విషయాన్ని పక్కన పెడితే స్వతంత్ర అభ్యర్థులుగా పాతికమంది బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం