Mlc Election Polling : ఈ నెల 27న జరిగే మెదక్ -నిజామాబాద్-కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా 25.02.2025 సాయంత్రం 4.00 గంటల నుంచి 27.02.2025 సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించినట్లు చెప్పారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని సైలెన్స్ పీరియడ్ లో ఎవరు కూడా రాజకీయపరమైన ఎస్.ఎం.ఎస్ లు, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపకూడదని, బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, ప్రచారం చేయరాదని కలెక్టర్ సత్పతి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. సైలెన్స్ పీరియడ్ లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్ ల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1)(బి) ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించే ఆయా జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు.
ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాట్లు ఇవ్వాలని కోరారు.
ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు, డ్యూటీ గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రత్యేక సాధారణ సెలవు, వెసులుబాట్లను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
సంబంధిత కథనం