TG Mlc Election : ముగిసిన ఎమ్మెల్సీ ఓటర్ల గడువు, నేటి నుంచి అభ్యంతరాలపై పరిశీలన
TG Mlc Election : ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి అభ్యంతరాలపై దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. పట్టభద్ర ఓటర్ల సంఖ్య 3,86,690, ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య 33,048కి పెరిగింది.
TG Mlc Election : ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసింది. ఓటర్ నమోదు, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 9తో ముగియడంతో నేటి నుంచి అభ్యంతరాలపై దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టారు.
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో గత నెల 23వ తేదీ నుంచి మొదలైన ఓటర్ నమోదు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ నిర్ణీత వ్యవధిలో కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియ కూడా కొనసాగింది. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా 1,117 ఫిర్యాదులను పలువురు అందజేశారు. ఇందులో పట్టభద్రులకు సంబంధించినవి 942 ఉండగా.. మిగతా 175 ఉపాధ్యాయులకు సంబంధించినవి. ఎక్కువగా పేర్లు, వివరాలకు సంబంధించిన మార్పుల కోసం అందాయి.
పెరిగిన ఓటర్లు
ఈ ఏడాది సెప్టెంబరు 30న ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమై నవంబరు 6వ తేదీ వరకు కొనసాగింది. దీంతో పట్టభద్రులు 3,58,579 మంది ఓటును నమోదు చేసుకోగా, ఉపాధ్యాయులు 27,994 మంది ఓటును పొందడానికి ఉత్సాహాన్ని చూపించారు. తిరిగి గత నెల 23వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు కొత్తగా నమోదుతోపాటు అభ్యంతరాలకు సమయం ఇవ్వడంతో కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి పలువురు ముందుకొచ్చారు. ఈ పక్షం రోజుల వ్యవధిలో పట్టభద్రులవి 28,111 ఓట్లు కొత్తగా చేరగా.. ఉపాధ్యాయుల పరంగా అదనంగా 5,054 మంది ఆసక్తిని చూపించారు. దీంతో మొత్తంగా పట్టభద్ర ఓటర్ల సంఖ్య 3,86,690కి చేరింది. ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య 33,048కి పెరిగింది. మలివిడతలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 10 నుంచి పరిశీలించి పక్కాగా ఉంటే ఆమోదం తెలుపుతారు. ఏవైనా తప్పుడు ద్రువపత్రాలుంటే తిరస్కరిస్తారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకునేవారుంటే తుది జాబితా వచ్చిన తరువాత కొన్నాళ్లు ఎన్నికల సంఘం అవకాశం కల్పించనుంది.
పోలింగ్ కేంద్రాల మార్పు కోసం 99 దరఖాస్తులు..
పోలింగ్ కేంద్రాల మార్పు, చేర్పుల కోసం 99 దరఖాస్తులు అందినట్లు అధికారులు ప్రకటించారు. వాటిపై నిర్ణయం తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ డీఆర్వో ఈ ప్రక్రియకు ఇన్ఛార్జి అధికారిగా వ్యవహరిస్తుండటంతో ఇక్కడి నుంచే వీటికి సంబంధించిన ఆదేశాలు అన్ని జిల్లాలకు అందిస్తున్నారు. వచ్చిన ఆక్షేపణలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో మండలాల వారీగా అధికారులు వాటిని పరిష్కరిస్తారు. ఇదే సమ యంలో మొత్తంగా 121 మండలాల్లో మళ్లీ కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలనను కొనసాగించనున్నారు.
30న తుది జాబితా..
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి తుది ఓటరు ముసాయిదా జాబితాను ఈనెల 30వ తేదీన ఎన్నికల సంఘం ఆదేశాలతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 313 పోలింగ్ కేంద్రాల పరిధిలో జాబితాలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించాలని ఆర్డీవోలకు, తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. ఇందుకు అనుగుణంగా పోలింగ్ బూత్ స్థాయిలో పక్కాగా పరిశీలనలు చేపట్టనున్నారు. 2019లో రూపొందించిన జాబితాలో తప్పుల తడక వల్ల అక్కడక్కడా పోలింగ్ రోజున ఇబ్బంది ఎదురైంది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా తుది జాబితాను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమవుతోంది. ఇదే సమయంలో 700 మంది ఓటర్లు మించిన చోట మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనల్ని ప్రాథమికంగా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి అందించనుంది.
రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం