తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. మార్చి 29 నాటికి మండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీరిలో మహమూద్ అలీ,ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 20వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రావటంతో...అధికార కాంగ్రెస్ లోని పలువురు నేతలు ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సంఖ్యా బలం పరంగా చూస్తే... కాంగ్రెస్ తో పాటు వారి మిత్రపక్షాలను కలుపుకొని నాలుగు సీట్లు కూడా వారి ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. ఇక ఒక సీటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావటంతో హస్తం పార్టీలోని నేతలు... ఎమ్మెల్సీ సీట్లను ఆశిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నామంటూ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకనే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే... కొందరు నేతలు సామాజిక సమీకరణాలు ముందుకు తెస్తున్నారు. మరోవైపు పార్టీలోకి వచ్చిన కొత్త నేతలు కూడా ఈ సీట్లపై కన్నేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును పలువురు సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. బీసీ కోటాలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. తనకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని అంటున్నారు. బీసీ కార్డును ప్రదానంగా తెరపైకి తీసుకువస్తున్నారు. పార్టీలో మరో సీనియర్ నేతగా ఉన్న మధుయాష్కీ కూడా సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన... ఎమ్మెల్సీ సీటును గట్టిగా ఆశిస్తున్నారు. సునీతా రావు, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య యాదవ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు ఎలాంటి నామినేటెడ్ పదవి కూడా రాలేదు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సీనియర్ సంపత్ కుమార్ కూడా సీటును ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించగా... దక్కలేదు. అయితే ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని చూస్తున్నారు. వీరే కాకుండా సీనియర్ నేతగా ఉన్న జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్ తో పాటు ఫిరోజ్ ఖాన్, ఖురేషీ వంటి నేతలు కూడా పావులు కదుపుతున్నారు. పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్, హర్కార వేణు గోపాల్ రావు, సామా రామ్మోహన్ రెడ్డి, పిడమర్తి రవి, సింగాపురం ఇందిరాతో పాటు మరికొంత మంది నేతలు సీటును ఆశిస్తున్నారు.
ఇక ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఆశీస్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ దక్కవొచ్చన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇయనే కాకుండా.... బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎగ్గే మల్లేశం కూడా మరోసారి తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.
ఇక ఒక ఎమ్మెల్సీ సీటును తమకు కేటాయించాలని భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఐ కోరుతోంది. పొత్తు నాటి చర్చలను తెరపైకి తీసుకువస్తూ... తమకు తప్పకుండా ఛాన్స్ ఇవ్వాలని కోరుతోంది.అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేయబోతుందనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న వాటిలో ఒకటి ఎంఐఎం కోటాలో ఉంది. వారు పోటీ చేసి తమ సీటును నిలబెట్టుకుంటారా..? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి...!
మొత్తంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు ఖరారు అంశం కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియార్టీతో పాటు సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకునే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందన్న టాక్ పార్టీ నేతలు, శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
సంబంధిత కథనం