Minister Ponguleti Emotional : ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు కార్చా.. మంత్రి పొంగులేటి భావోద్వేగం
Minister Ponguleti Emotional : ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు పెట్టుకున్నానంటూ మంత్రి పొంగులేటి భావోద్వేగ్వానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Minister Ponguleti Srinivas Reddy Emotional: "గతేడాది ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది.. నాతో పాటు నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలను కూడా అనేక ఇబ్బందులు పెట్టింది.. ఆ పార్టీ నాయకులు ఎన్నో అవమానాలకు గురిచేశారు. ఆ సమయంలో నేను పడుతున్న బాధను నా అనుచరులెవ్వరికీ తెలియనివ్వలేదు.. ఆ బాధను దిగమింగి వారికి ధైర్యం చెప్పా.. నా బాధను కూడా వ్యక్త పరిస్తే ఎక్కడ నా వాళ్ళు ఇబ్బంది పడతారోననే ఉద్దేశ్యంతో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేవాడిని.." అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
ఖమ్మంలో రైట్ చాయిస్ అకాడమీ నిర్వహించిన ఆత్మీయ అభినందన వేడుక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారన్నారు. అలా వివక్షకు గురైన నిరుద్యోగులందరూ కలసి మొన్నటి ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతుందని స్పష్టం చేశారు. టీఎస్పిఎస్సి ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి నాయ్యం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
లఘు చిత్ర ప్రదర్శన..
రాజకీయాల్లోకి వచ్చింది మొదలుకుని మంత్రి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానాన్ని లఘుచిత్రం రూపంలో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ రూపకర్త రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ను పొంగులేటితో పాటు పలువురు అభినందించారు. రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన నిరుద్యోగుల సదస్సు నుంచే బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను గళం వినిపించిన విషయాన్ని పొంగులేటి గుర్తు చేసుకున్నారు.