YCP vs TRS: బీజేపీకి బీ టీమ్ వైసీపీ… ఏపీ ప్రభుత్వ పెద్దలపై మంత్రి గంగుల ఫైర్
టీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య డైలాగ్ లు పేలుతూనే ఉన్నాయి. హరీశ్ రావ్ కామెంట్స్ తో మొదలైన రచ్చ...పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. తాజాగా వైసీపీ నేతలే టార్గెట్ గా మంత్రి గంగుల కమలాకర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Minister Gangula Fires On YCP Leaders: టీచర్ల సమస్యలు, మోటర్లకు మీటర్ల అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు... హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ పై వైసీపీ నేతలు ఓ రేంజ్ లోనే ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం గురించి హరీష్ కు అనవసరమని.. ఏమైనా ఉంటే కేసీఆర్ తో చూసుకోవాలంటూ కౌంటర్లు విసిరారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఓ గ్యాంగ్ తో హరీష్ రావు కూడా కలిశారా అన్న అనుమానం కలుగుతోందంటూ సజ్జల కూడా సెటైర్లు విసిరారు. అయితే తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఈ అంశంపై స్పందించారు.
వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ లో మాట్లాడిన గంగుల.... హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారని నిప్పులు చెరిగారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. తెలంగాణపై, టీఆర్ఎస్ పై ఎందుకు విషం చిమ్ముతున్నారని నిలదీశారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడేవాళ్లను హెచ్చరిస్తున్నానని, రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. అన్నా చెల్లెల్లను విడదీసినట్టుగా కేసీఆర్ కుటుంబాన్ని వేరు చేస్తామంటే కుదరదన్నారు.
minister gangula on sajjala: సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అమర్నాథ్..హరీశ్‌రావు, టీఆర్ఎస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సజ్జల మాతో ఎందుకు పెట్టుకుంటున్నారు. మా సంగతి తెలియదా? గతంలో చూశారు మళ్లీ చూస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే బుద్ధి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ విమర్శించారు. వైఎస్ కుటుంబంలోకి వచ్చి తల్లి, కుమారుడు, చెల్లిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని సజ్జల విడగొట్టాలనుకున్నా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. దేశానికి మార్గదర్శకంగా ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వైసీపీ జతకలిసిందని గంగుల ఆరోపించారు
ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఉపాధ్యాయుల పట్ల ఏపీ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని చెప్పారు. మోటర్లకు మీటర్ల విషయంలోనూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రులు అమర్ నాథ్, బొత్స..హరీష్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, అధికార వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
అనుబంధ కథనం:
సంబంధిత కథనం