TG New Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుల పేరిట దోపిడీ.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి
TG New Ration Cards : ప్రస్తుతం తెలంగాణలో మీసేవ కేంద్రాల దందా నడుస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని.. మీసేవ నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క దరఖాస్తుకు రూ.100 నుంచి వెయ్యి వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రజలు మీసేవ కేంద్రాలకు కూకట్టారు. ప్రభుత్వం ఎలాంటి గడువు విధించకపోయినా.. మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఇదే అదునుగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తూ.. జేబులు నింపుకుంటున్నారు.
ప్రభుత్వం నిర్ణయించింది రూ.50..
రేషన్ కార్డు దరఖాస్తు ఫీజును రూ.50గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. చాలా సెంటర్లలో నిర్ణయించిన ఫీజు కంటే.. రూ.100 నుంచి రూ.800 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే తీసుకో.. లేకపోతే పో.. అంటూ మీసేవ నిర్వాహకులు గద్దిస్తున్నారు. దీంతో చేసేదెం లేక.. ప్రజలు అడిగినంత ఇస్తున్నారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి.. ఎలా చేయాలో తెలియక నష్టపోతున్నారు.
డయల్ 1100..
రేషన్ కార్డు అప్లికేషన్ కోసం మీసేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అధికారులు చెబుతున్నారు. జనం అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది నిర్వాహకులు.. అంతకుమించి తీసుకుంటున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. ఎక్కువ డబ్బులు వసూలు చేసే వారిపై 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే చాలా ఫిర్యాదులు..
ఇప్పటికే చాలావరకు ఫిర్యాదులు వచ్చాయని, వారికి షోకాజ్‌నోటీసులు ఇచ్చామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సెంటర్లలో నిర్ణయించిన ఫీజునే తీసుకుంటున్నారు. కానీ.. ప్రైవేట్ నిర్వాహకులు నడిపే మీసేవ కేంద్రాల్లోనే దోపిడీ జరుగుతోంది.
ఎక్కడ చూసినా జనమే..
గత మూడు రోజులుగా ఏ మీసేవ కేంద్రంలో చూసినా.. వందల మంది కనిపిస్తున్నారు. ఉదయం 7 గంటలకే వచ్చి వేచి చూస్తున్నారు. 9 గంటలకు మీసేవ కేంద్ర ఓపెన్ చేయగానే.. ఒక్కసారిగా మీదపడుతున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో.. అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అవుతోంది. దీంతో చాలామంది ఐదారు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
50 శాతం వీరే..
ప్రస్తుతం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో.. 50 శాతం మంది ఇదివరకు అప్లై చేసుకున్నవారే ఉంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఎందుకైనా మంచిదని మళ్లీ అప్లై చేస్తున్నారు. మీ సేవా కేంద్రాలకు వందల సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారే వస్తుండడంతో.. క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
లాస్ట్ డేట్ లేదు..
అయితే.. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి చివరి తేదీ లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయం తెలియని చాలామంది మీ సేవా సెంటర్లకు క్యూ కడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే అప్లై చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.