Raids On Clinics : శివారు ప్రాంతాల్లోని మెడికల్ క్లినిక్‌లపై దాడులు - 50 మందికిపైగా నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలు
'Fake Clinics in Hyderabad: నకిలీ క్లినిక్‌లపై తెలంగాణ వైద్య మండలి అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని దాదాపు 50 మంది నకిలీ డాక్టర్లను గుర్తించారు.
Fake Clinics in Hyderabad: తెలంగాణ వైద్య మండలి అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్నారు.
వేర్వేరు బృందాలుగా చేపట్టిన ఈ తనిఖీలతో నకిలీ వైద్యుల బాగోతం బట్టబయలైంది. క్లినిక్ ల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ అందజేస్తున్నట్లు గుర్తించారు.
వైద్యులుగా చెప్పుకోవటమే కాకుండా…. క్లినిక్ లకు అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా నడిపిస్తున్నారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరిని రిమాండ్ చేశారు.
నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని పిలుపునిస్తున్నారు.
నకిలీ ఆయుర్వేద ఔషధాలు సీజ్….
Fake Medicines Seize: తప్పుడు ప్రకటనలతో ఔషధాలు తయారు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్న తయారీ సంస్థలపై తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అభ్యంతరకరమైన ప్రకటనలతో మార్కెట్‌లో తరలిస్తున్న మందులను గుర్తించేందుకు మే 23, 24 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేటలో 'న్యుమోనియా'కు ఆయుర్వేద ఔషధం పేరుతో తయారు చేస్తున్న ఆర్థో విన్ గోల్డ్ ఆయిల్ ను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లో 'మధుమేహం'కు ఆయుర్వేద ఔషధం పేరుతో ఉసిరి జ్యూస్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఆయుర్వేద ఔషధాల పేరుతో పలు సంస్థలు తమ లేబుళ్లపై 'న్యుమోనియా' 'డయాబెటీస్'కి చికిత్సకు పని చేస్తాయని విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. తప్పుడు ప్రచారాలతో మార్కెట్‌లో చలామణి అవుతున్న కొన్ని మందులను గుర్తించారు. ఇలాంటి ప్రచారాలు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం ప్రకారం నిషిధ్దమైనవిగా పేర్కొన్నారు. అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్న సంస్థలపై చర్యలు చేపట్టారు.
గండిపేటలో పట్టుబడిన ఆర్థో విన్ గోల్డ్ ఆయిల్, న్యూమోనియాను తగ్గిస్తుందనే ప్యాకింగ్ పై ముద్రించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేస్తున్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని మెడికల్ షాపులో నిర్వహించిన సోదాల్లో మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ సేవలు….
చట్టవిరుద్ధమైన ఔషధాల విక్రయాలకు సంబంధించి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారికి టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఇలాంటి ఔషధాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు తెలియచేయవచ్చని ప్రకటించారు.