TG MBBS Counselling: : తెలంగాణ ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం,రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు-telangana mbbs counseling to start registration of web options from tomorrow ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mbbs Counselling: : తెలంగాణ ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం,రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

TG MBBS Counselling: : తెలంగాణ ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం,రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 25, 2024 08:57 AM IST

TG MBBS Counselling: నీట్ ర్యాంకుల ఆధారంగా తెలంగాణలో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాళోజీ హెల్త్‌ యూనివర్శిటీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. గురువారం నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోడానికి అనుమతిస్తారు.

రేపటి నుంచి తెలంగాణ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు
రేపటి నుంచి తెలంగాణ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు

TG MBBS Counselling:తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 26 గురువారం నుంచి నీట్ ర్యాంకుల ఆధారంగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కన్వీనర్‌ కోటాలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 16,679మంది విద్యార్థులు మెరిట్‌ జాబితాను ఇప్పటికే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది.

మెరిట్‌ లిస్ట్‌ను ఈ లింకు ద్వారా చూడొచ్చు..

https://www.knruhs.telangana.gov.in/uploads/20240924150058TS_UG_Medical_2024_Verified_list_23-09-2024_FINAL.pdf

మెరిట్‌ లిస్ట్‌పై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం ఐదు గంట ల్లోపు విశ్వవిద్యాలయం వెబ్‌ సైట్‌ ద్వారా తెలియజేయాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బి.కరుణాకర్ రెడ్డి తెలిపారు. మెరిట్ ఆర్డర్‌పై అభ్యంతరాల పరిశీలన తర్వాత గురువారం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.

మరోవైపు తుదిజాబితా విడుదలతో పాటు గురువారం సెప్టెంబర్ 26 నుంచి నీట్ ర్యాంకర్లకు కన్వీనర్‌ కోటాలో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ మేరకు విద్యార్థులు అన్ని పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాది వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు వివరాలు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్‌ కాలేజీల వారీగా వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో జాబితాలు..

తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై వివాదం తలెత్తడంతో ఈ ఏడాది కౌన్సిలింగ్ ప్రక్రియలో జాప్యం జరిగింది. కోర్టు వివాదాలతో కౌన్సిలింగ్‌ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో, ఇంటర్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో స్థానికతకు సంబంధించిన మార్గద ర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించడంతో పాటు కోర్టును ఆశ్రయిం చిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది.

హైకోర్టు ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయశాఖ సమీక్ష, సూచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్‌ నిర్వహణకు అనుమతించింది. స్థానికతపై కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది.

తెలంగాణలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 15% సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లు రాష్ట్ర విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి ప్రవేశాల నిబంధన గడువు ముగియడంతో మిగిలిన సీట్లన్ని తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రైవేటు కళాశాలల్లో మరో 4,810 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో సగం కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్‌, ఎన్నారై కేటగిరీలలో భర్తీ చేస్తారు. ఏపీలో ఇప్పటికే కన్వీనర్‌ కోటా మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసింది. విద్యార్థులు కాలేజీలలో రిపోర్ట్ చేయడానికి నేటి వరకు గడువు ఉంది.