Maha Kumbh Mela : మహా కుంభమేళా యాత్రలో విషాదం.. తెలంగాణ వ్యక్తి సజీవ దహనం.. 49 మందికి తప్పిన ప్రమాదం
Maha Kumbh Mela : మహా కుంభమేళా యాత్రలో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మహా కుంభమేళా నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు.
మహా కుంభమేళా యాత్రలో విషాదం జరిగింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు మహా కుంభమేళాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని ఆలయ సమీపంలో ఆగారు. బస్సును పక్కకు నిలిపారు. ఈ సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఓ వ్యక్తి చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. 49 మంది యాత్రికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.

ఆలయ సందర్శనకు వెళ్లగా..
49 మంది యాత్రికులు మధురలోని ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన శీలం ద్రూపత్ (60) అనే వ్యక్తి బస్సులోనే ఉన్నాడు. ద్రూపత్ పొగ తాగడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని యాత్రికులు అనుమానిస్తున్నారు. స్థానిక అగ్నిమాపక యంత్రాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి.
ఎమ్మెల్యే భరోసా..
మధుర కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడి యాత్రికులను వీలైనంత త్వరగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెల్లడించారు. ప్రయాణికులకు ఆహారం, వసతి కల్పించామని ఆయన వివరించారు. ఈ అగ్ని ప్రమాదంలో యాత్రికుల వస్తువులు కూడా కాలిపోయాయని చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పొగ తాగడం వల్ల..
మధుర డీఎం శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "తెలంగాణకు చెందిన ఒక భక్తుడు కాలిన గాయాలతో మరణించాడు. యాత్రికులందరూ ఒకే జిల్లాకు చెందినవారు. కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి 'దర్శనం' కోసం బృందావనంలో ఆగారు. బస్సు లోపల ఒక ప్రయాణికుడు పొగ తాగడం వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. యాత్రికులను ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని వివరించారు.
యాత్రికుల పరుగులు..
అత్యవసర సేవలు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి గంటకు పైగా సమయం పట్టింది. ఈ ఘటనతో భారీ నష్టం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిమిషాల్లోనే వాహనం మంటలకు ఆహుతైందని, యాత్రికులు తమ వస్తువులను కాపాడుకోవడానికి పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.