రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మెుత్తం 565 జెడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే నామినేషన్ల ప్రక్రియ మెదలవుతుందని తెలిపింది.
మెుదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థులు జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5,000. రిజర్వేషన్ అభ్యర్థి రూ.2500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీకి జనరల్ అభ్యర్థి రూ.2500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పెట్టారు. 23వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 11న కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెలువడుతాయి.
రెండో విడతలో మిగిలిన స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 13న నామినేషన్లు స్వీకరణ మెుదలవుతుంది. 15న ముగిస్తారు. అక్టోబర్ 16న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న రెండు విడతలకు సంబంధించి ఓట్లు లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడుతల్లో నిర్వహిస్తారు. 12,733 సర్పంచులు, 1,12,288 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మెుదటి విడతకు సంబంధించి అక్టోబర్ 17న నామినేషన్లు ప్రారంభమై అక్టోబర్ 19న ముగుస్తుంది. అక్టోబర్ 20న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇస్తారు. అక్టోబర్ 31న ఉదయం పోలింగ్ నిర్వహించి.. అదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
ఇక రెండో విడతకు సంబంధించి అక్టోబర్ 21న నామినేషన్ల స్వీకరణ మెుదలై.. అక్టోబర్ 23 వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24, అక్టోబర్ 27 వరకు ఉపసంహరణ, నవంబర్ 4న ఉదయం ఎన్నికలు నిర్వహించి అదే రోజులు ఫలితాలు వెల్లడిస్తారు.
మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేష్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 25న మెుదలవుతుంది. అక్టోబర్ 27న ముగుస్తుంది. అక్టోబర్ 28న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 31 వరకు ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 8న ఉదయం పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.