TS Liquor Shops Lucky Draw : తెలంగాణలో మద్యం దుకాణాల లక్కీ డ్రా, భారీగా తరలివచ్చిన వ్యాపారులు
TS Liquor Shops Lucky Draw : తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో అర్హులను ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు.
TS Liquor Shops Lucky Draw : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధీనంలో లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతోంది. లక్కీ డ్రా సెంటర్ లకు పెద్ద ఎత్తున మద్యం వ్యాపారులు చేరుకున్నారు. దీంతో పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. మద్యం షాపుల లక్కీ డ్రా కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబర్ పేట్ రానా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. లక్కీ డ్రా జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీస్ భద్రత ఏర్పాటుచేశారు. దరఖాస్తుదారుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా కొనసాగుతోంది.

డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల్లో అమ్మకాలు
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2,620 మద్యం షాపుల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో అర్హులను ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. మండలాల వారీగా ప్రాతిపదికగా లక్కీ డ్రా తీస్తున్నారు. ఎంపికైన వ్యాపారుల పేర్లను వెంటనే ప్రకటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారు ఈ నెల 23లోపు వార్షిక లైసెన్స్ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల్లో అమ్మకాలకు లైసెన్స్ దారులను అనుమతిస్తారు.
అత్యధిక దరఖాస్తులు
రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు 1,31,490 అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్, ఎక్సైజ్ జిల్లాల్లో 42,596 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. సరూర్ నగర్ లో 134 మద్యం షాపులకు 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లో 100 దుకాణాలకు 10,811 అప్లికేషన్లు వచ్చాయి. నల్లగొండలో 155 దుకాణాలకు 7,058, ఖమ్మంలో 122 షాపులకు 7,027, మేడ్చల్‌లో 114 దుకాణాలకు 7,017 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
దరఖాస్తుల ద్వారా భారీ ఆదాయం
తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలకు లైసెన్స్ కోసం టెండర్ల ఇటీవల ముగిసింది. ఇవాళ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులకు టెండర్ల ఆహ్వానిస్తే... 1,31, 490 అప్లికేషన్లు వచ్చినట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.2,629.80 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. మద్యం దరఖాస్తులతో ప్రభుత్వం అంచనాలకు మించి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సరూర్‌నగర్‌లో 10,908, శంషాబాద్‌లో 10,811 అప్లికేషన్లు వచ్చినట్లు అబ్కారీ అధికారులు చెప్పారు. 2021లో మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానిస్తే 68,691 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.