మందుబాబులకు తెలంగాణ సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం...తాజాగా మద్యం రేట్లను కూడా పెంచింది. లిక్కర్ పై సెస్ ను ఎక్సైజ్ శాఖ సవరించింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను పునరుద్ధరించింది.
2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను విధించింది. వివిధ కారణాలతో 2023లో దీనిని తొలగించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
అలాగే పలు రకాల మద్యం బాటిల్స్ పై సెస్ పెంచింది. బీర్లు, ఛీప్ లిక్కర్ ,బ్రీజర్ లాంటి డ్రింక్ పై ప్రత్యేక సెస్ ను సవరించలేదు. వీటిపై పాత పన్నులు యథావిధిగా ఉంటాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే వైన్ షాపులకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు జారీ చేసింది. 180 ఎం.ఎల్ బాటిల్ పై రూ.10, ఆఫ్ బాటిల్ పై రూ.20 , ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచుతున్నట్లు మద్యంషాపులకు జారీ చేసిన సర్క్యులర్లలో పేర్కొంది. మద్యం ధరల పెంపుపై మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.
విస్కీ, బ్రాందీ క్వార్టర్‌పై రూ.10, ఆఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున ఎక్సైజ్ శాఖ పెంచింది. పెంచిన మద్యం ధరలు మే 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా తాగే ఛీప్ లిక్కర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఇటీవల బీర్ల ధరలు పెరగడంతో చాలా మంది మందు బాబులు విస్కీ, బ్రాందీకి షిఫ్ట్ అయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని మద్యం ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. 15 శాతంగా లెక్కిస్తే ఒక్క బీరు ధర రూ.150 ఉంటే వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో కలిపి రూ.180 వరకు పెరిగే అవకాశం ఉంది.
ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో మద్యం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. దీంతో మద్యం సరఫరాల కంపెనీలు లిక్కర్ ధరలు పెంచాలని పట్టుబడుతున్నాయి. మందుగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మార్కెట్ లో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఓ మల్టీనేషనల్ బీర్ల కంపెనీ ప్రస్తుత ధర మీద అదనంగా 30.1 శాతం చెల్లించాలని కోరుతుంది.
ఈ డిమాండ్ల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ మద్యం ధరలను 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా బీర్ల బేసిక్ ధరలను 15 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
సంబంధిత కథనం