Jio 5G Services : తెలంగాణలో 850కి పైగా ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు, వెల్ కమ్ ఆఫర్ కింద అపరిమిత డేటా!
Jio 5G Services : తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, గ్రామాలతో సహా 850కి పైగా ప్రాంతాల్లో జియో 5 జీ సేవలు విస్తరిస్తున్నట్లు తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి తెలిపారు.
Jio 5G Services : తెలంగాణలో మొబైల్ యూజర్లకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలతో సహా 850కి పైగా ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన వినియోగదారులకు అత్యుత్తమ ట్రూ 5జీ సేవలు అందించడానికి జియో కట్టుబడి ఉందని జియో ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జియో 1 Gbps+ వరకు అపరిమిత డేటాను వినియోగదారులకు జియో వెల్ కమ్ ఆఫర్ ద్వారా ఉచితంగా అందిస్తోందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, విద్యాసంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థల్లో జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పట్టణాలకు చేరువలో ఉండే పలు గ్రామాలు కూడా జియో ట్రూ 5జీ కనెక్టివిటీతో లబ్ధి పొందనున్నాయని వెల్లడించారు.
తెలంగాణలోని 850 ప్రాంతాల్లో
జీయో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలు సహా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను విస్తరిస్తున్నామన్నారు. తెలంగాణలోని మొబైల్ యూజర్లకు జియో అత్యంతగా అభిమానించే టెక్నాలజీ బ్రాండ్ గా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా యువత పట్ల జియో కొనసాగిస్తున్న నిబద్ధతకు నిదర్శనం ఈ నెట్ వర్క్ విస్తరణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 850 పైగా ప్రాంతాల్లో 5 జీ సేవలను అందించిన మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా జియో ఉందన్నారు. జియో ట్రూ 5జీ కవరేజ్ వేగవంతమైన విస్తరణ, సాంకేతిక ప్రభావాన్ని బలోపేతం చేయడం, తెలంగాణలో జియో వినియోగదారులకు ప్రయోజనాలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5 జీ సేవలు
2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకాలో ట్రూ 5జీ సేవలను ప్రారంభించాలని జియో ప్రణాళికలు చేస్తుందని కేసీ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్త విస్తరణకు జియో ట్రూ 5జి నెట్‌వర్క్ వినియోగదారులకు అధునాతన సాంకేతికత పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుందన్నారు. సాంకేతికంగా జియో ట్రూ 5జీ మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉందన్నారు. ఇవే అంశాలు జియోని భారతదేశంలోని ఏకైక ట్రూ 5జీ నెట్ వర్క్ గా నిలిపాయన్నారు. జియో 4జీ నెట్‌వర్క్‌పై ఆధార పడకుండా, స్వతంత్ర 5జీ ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుందన్నారు. జియో 700 MHz, 3500 MHz , 26 GHz బ్యాండ్‌లలో 5G స్పెక్ట్రమ్ అతిపెద్దదిగా చెప్పారు. క్యారియర్ అగ్రిగేషన్ 5జీ ఫ్రీక్వెన్సీలను సజావుగా మిళితం చేసి, మొత్తం కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని తెలిపారు. జియో ట్రూ 5Gని ప్రవేశపెట్టడం తెలంగాణలో సంచలనం సృష్టించనుందన్నారు.