TJS Deadline: కాంగ్రెస్‌కు 24 గంటల డెడ్ లైన్ పెట్టిన తెలంగాణ జన సమితి-telangana jana samithi has given 24 hours deadline to congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tjs Deadline: కాంగ్రెస్‌కు 24 గంటల డెడ్ లైన్ పెట్టిన తెలంగాణ జన సమితి

TJS Deadline: కాంగ్రెస్‌కు 24 గంటల డెడ్ లైన్ పెట్టిన తెలంగాణ జన సమితి

HT Telugu Desk HT Telugu
Oct 17, 2023 06:20 AM IST

TJS Deadline: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని భావిస్తోన్న తెలంగాణ జనసమితి, తాము పోటీ చేయాలనుకుంటున్నస్థానాలపై 24గంటల్లో క్లారిటీ ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది.

పొత్తుల సంగతి తేల్చాలంటున్న టిజేఎస్‌
పొత్తుల సంగతి తేల్చాలంటున్న టిజేఎస్‌

TJS Deadline: తెలంగాణ రాష్ట్ర శాసన సభకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి తెలంగాణ జన సమితి (టీజేఎస్) సిద్ధపడుతోంది. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఈ దిశలో చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు పొత్తుల అంశం చర్చలో ఉండగానే కాంగ్రెస్ నాయకత్వం 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో టీజేఎస్ కోరుతున్న స్థానాలు కూడా ఉన్నాయి.

పొత్తుల అంశంపై కాంగ్రెస్ మీన మేషాలు లెక్కపెడుతున్న నేపథ్యంలో టీజేఏస్ నాయకత్వం కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపి ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించింది. ఆలోగా ఏ విషయమూ తేల్చకుంటే తాము సొంతంగా ఆయా స్థానాల్లో పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని టీజేఎస్ నాయకత్వం భావిస్తోంది.

ఆరు సీట్లు కోరుతున్న తెలంగాణ జన సమితి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతన్న సమయంలో టీజాక్ చైర్మన్ గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండ రామ్ ఆధ్వర్యంలోనే తెలంగాణ జనసమితి ఏర్పాటయ్యింది. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేసినా ఎక్కడా విజయవంతం కాలేక పోయింది.

రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న బలమైన అభిప్రాయంలో ఉన్న టీజేఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు కోరడం ద్వారా తామూ ఎన్నికల్లో లబ్దిపొందడం, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్న తమ ఓట్లను కాంగ్రెస్ కు ట్రాన్సఫర్ అయ్యేలా చూడడం లక్ష్యంగా పొత్తుల ప్రతిపాదన తెచ్చింది.

టీజేఎస్ తెలంగాణలో తమకు 12 సీట్లు కావాలని ప్రతిపాదన పెట్టినా కేవలం 6 సీట్లపైనే చర్చ జరిగినట్లు సమాచారం. జహీరాబాద్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, ముథోల్, నర్సంపేట, కోరుట్ల, గద్వాల టికెట్లను ఆశిస్తోంది. ఇదే ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకత్వం ముందు పెట్టింది. కానీ, చర్చలు ఓ కొలిక్కి వచ్చి, సీట్ల వ్యవహారం తేలక ముందే ఏఐసీసీ ప్రకటించిన తొలి జాబితాతో టీజేఎస్ నాయకత్వం ఖంగుతిన్నది. ఎందుకంటే వీరు కోరుతున్న స్థానాల్లో కొన్నింటిలో కాంగ్రెస్ తన అభ్యర్థుల ప్రకటించింది.

24 గంటల డెడ్ లైన్ పెట్టాం: ధర్మార్జున్ రెడ్డి, టీజేఎస్ జనరల్ సెక్రటరీ

‘‘ కుటుంబ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ జనసభ ఆవిర్భవించింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి మాకున్న రాజకీయాల విధానాలను రిజర్వులో పెట్టుకుని ఈ దుర్మార్గ పాలనను కూలగొట్టడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి మా రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ తో చెప్పింది. కాంగ్రెస్ వారు కూడా మాట్లాడారు.

ఢిల్లీలో ఖర్గేను, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ను, టీపీసీసీ అధ్యక్షున్ని కూడా కలిశాం. కానీ, మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వాళ్లు ఏకంగా 55 పేర్లతో లిస్టు ప్రకటించారు. దీంతో సహజంగానే మా పార్టీలో ఒక చర్చ, ఒత్తిడి మొదలైంది. ఒక దుర్మార్గున్ని కూలగొట్టడానికి మాత్రమే మా రాజకీయాలను రిజర్వులో పెట్టుకుని మీతో మేం ప్రయాణిస్తున్నామన్నారు.

పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నపుడు పరస్పర గౌరవాలు అవసరం. అది గౌరవించి 24 గంటల్లోగా మంగళవారం సాయంత్రం లోగా .. మేం మీ ముందు పెట్టిన లిస్టుపై స్పష్టత ఇవ్వాలి, లేదంటే మా రాష్ట్ర కమిటీ కూడా ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ జనసమితి పార్టీ అంటనే తెలంగాణ ఉద్యమకారుల వేదిక. పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం…’’ అని తెలంగాణ జనసమితి జనరల్ సెక్రటరీ ధర్మార్జున్ రెడ్డి వివరించారు.

ధర్మార్జున్ సూర్యాపేట నుంచి టీజేఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుల విషయలో ఏదో ఒక విషయాన్ని తేల్చుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధులతో ఆయన ఆధ్వర్యంలో టీజేఎస్ ప్రతినిధులు చర్చలు జరిపారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )

Whats_app_banner