హైదరాబాద్, జూలై 14, 2025: తీన్మార్ మల్లన్నగా పేరుపొందిన చింతపండు నవీన్‌పై తెలంగాణ జాగృతి మహిళా విభాగం నేతలు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు ఈ ఫిర్యాదును అందజేశారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో, తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు తమ ఫిర్యాదు లేఖను కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాలకు అందజేశారు.
కాగా ఛైర్‌పర్సన్ అందుబాటులో లేనందున తాను ఫిర్యాదు లేఖను తీసుకోనని, సభ్యులకే ఇవ్వాలని సూచించి మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజా రమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ్యులకు లేఖను సమర్పించారు.
మల్లన్న తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా, ఈరోజు అంతకన్నా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితను దూషించిన విషయాన్ని జాగృతి నేతలు మహిళా కమిషన్‌కు వివరించారు. మల్లన్న వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవాన్ని, అసభ్యతను ప్రదర్శిస్తున్నాయని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కమిషన్‌ను కోరారు.