Union Budget 2025 : కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు.. కీలక ప్రాజెక్టులకు సాయం కోసం ఎదురుచూపులు!
Union Budget 2025 : ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై తెలంగాణ సర్కారు ఆశలు పెట్టుకుంది. పలు భారీ పథకాలకు సాయం చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..
1.హైదరాబాద్ రిజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలు, ఫ్యూచర్ సిటీ.. వంటి పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
2.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం చేపడతామని చెప్పిన ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని రేవంత్ సర్కారు డిమాండ్ చేస్తోంది.
3.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పలు పనులకు రూ.14 వేల కోట్లు అవసరమని.. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి దశలవారీగా నిధులు ఇవ్వాలని కోరుతోంది.
4.ఇటు గోదావరి జలాల తరలింపు, గ్రేటర్ హైదరాబాద్‌కు భవిష్యత్తులో తాగునీటి అవసరాలు తీర్చేందుకు, మూసీలో శుద్ధమైన జలాల ప్రవాహంతో నగర వాసుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు నిధులు అవసరం అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది.
5.హైదరాబాద్ నగరంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం చేస్తూ చేపట్టే రేడియల్ రోడ్ల నిర్మాణాని కూడా.. నిధులు కావాలని రేవంత్ సర్కారు ప్రతిపాదనలు పంపింది.
6.శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నలుమూలలకు మెట్రోరైలు విస్తరణ కోసం నిధులు కావాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించింది.
7.కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు పెంచాలని కోరుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రాంటుగా రూ.13,179 కోట్లు రాగా.. 2023-24లో రూ.41,259 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. కానీ.. రూ.9,730 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పలు పథకాలకు నిధులు కేటాయించలేదు.
8.గతేడాది దాదాపు 76 శాతం గ్రాంటుల్లో కోత పడింది. దీంతో 2024-25 తెలంగాణ బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటును రూ.21,636 కోట్లుగా చూపారు. కానీ గత 9 నెలల్లో రూ.4,771 కోట్లు మాత్రమే వచ్చాయి. మూడు నెలల్లో మరో రూ.5 వేల కోట్లకు మించి రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
9.గతంలో భారీగా కోత పడిన నేపథ్యంలో.. వచ్చే ఏడాది అన్ని పథకాలకు కలిపి గ్రాంట్లుగా దాదాపు రూ.30 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు సమాచారం.
10.తెలంగాణ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులకు డబ్బుల కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.