TG BCs Reservations : స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ తెలంగాణ శాసనసభ బిల్లు ఆమోదించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...ఈ నిర్ణయం దేశానికి ఆదర్శం అన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా అసమానతలు గమనించి ఎవరెంతో వారికంత న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని భావించారన్నారు.
"తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో జిత్నే అజాది ఉత్నే ఇసదరి అని కుల గణన చేపట్టాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి 4న కేబినెట్ లో నిర్ణయం తీసుకొని 16 ఫిబ్రవరి 2024లో శాసనసభలో ప్రవేశపెట్టి నిర్ణయం నుండి నివేదిక దాక ఒక సంవత్సరంలోపు ఫిబ్రవరి 4 2025న ఇదే శాసనసభలో నివేదిక ప్రవేశ పెట్టాం. ఇవాళ మార్చి 17న కుల సర్వే ఆధారంగా తెలంగాణ జనాభాపై ప్రామాణిక సర్వే ద్వారా బీసీలకు 42 శాతం రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ఆమోదించింది" -మంత్రి పొన్నం ప్రభాకర్
"షెడ్యూల్ 9లో చేర్చడానికి కేంద్రానికి పంపే బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిచింది. ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా యావత్ తెలంగాణ సరైన ప్రాతినిధ్యం లేని వర్గాలు వారి ఆకాంక్షలు నెరవేర్చే సందర్భంలో వారి ఆలోచనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీని కలిసి 50 శాతం స్లాబ్ ఎత్తివేయాలని, బహిరంగంగా వేధికలతో పాటు రాహుల్ గాంధీ నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తుంది. 2019 జనవరి 12 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 50 శాతం స్లాబ్ ఎత్తివేశారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేస్తున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో పెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దిల్లీ వెళ్లి సాధించుకుంటాం. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్న నాయకుల సహకారం తీసుకుని ముందుకు పోతాం. 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం. ఈ బిల్లును సాధించుకునే వరకు అందరం కలిసి దిల్లీ గద్దె వరకు వెళ్లి 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం"- మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని రెండు బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో సీఎం పేర్కొన్నారు.
సంబంధిత కథనం