హైదరాబాద్: తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో, లబ్ధిదారులే ఆ ఇళ్లను పూర్తి చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా, సొంత స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ల ద్వారా జరుగుతున్న నిర్మాణ విధానం నుండి, లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణ విధానంలో ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు.
నిరుపేదలకు నిలువ నీడ కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని, కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వం ఈ కర్తవ్యాన్ని విస్మరించిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. "రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేశారు" అని ధ్వజమెత్తారు.
పదేళ్లలో కేవలం 60 వేల ఇళ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేశారని, కనీస సదుపాయాలైన త్రాగునీరు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి వాటిని పూర్తిగా విస్మరించారని మంత్రి విమర్శించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించడంతో పాటు, అసంపూర్తిగా ఉన్న 1.61 లక్షల ఇళ్లను రూ. 640 కోట్లతో పూర్తి చేసి, ఇప్పటికే 98 వేల మంది లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని మంత్రి పొంగులేటి వివరించారు. ఇంకా 69 వేల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయని, వీటిని బీఎల్‌సీ మోడ్‌లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి త్వరగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి, ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 2.65 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 71 వేల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, దాదాపు 3 వేల ఇళ్లు గోడలు, స్లాబ్‌ల వరకు పూర్తయ్యాయని మంత్రి వివరించారు.