హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! సర్కార్ ఏం చేయబోతుంది..?-telangana high court stays bc reservation order what is the government going to do about the local body elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! సర్కార్ ఏం చేయబోతుంది..?

హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! సర్కార్ ఏం చేయబోతుంది..?

బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. నోటిఫికేషన్ కూడా నిలిపివేస్తున్నట్లు ఈసీ కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా తదుపరి విచారణను కూడా వాయిదా వేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నోటిఫికేషన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను కూడా ఎత్తివేశారు.

ప్రభుత్వం ఏం చేయబోతుంది..?

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు జీవో 9పై కూడా హైకోర్టు స్టే ఇవ్వటంతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను వెకేట్ చేయించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇలా కాకుండా హైకోర్టులో కేసులో తేలే వరకు ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన కూడా చేయవచ్చు.

ఇలా కాకుండా… పాత రిజర్వేషన్లతోనే మరో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలను నిర్వహించే అవకాశం కూడా ఉంది. కానీ పాత రిజర్వేషన్లతోనే నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికలకు వెళ్తే బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణుంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చే ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘాలతో పాటు ప్రధాన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో మరో చర్చ కూడా వినిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కోర్టుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో… పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. అయితే దీనిపై ఆ పార్టీ అధినాయకత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. 5,982 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు(ఎంపీటీసీ), 585 జడ్పీటీసీ స్థానాలు ఉండగా… వీటన్నింటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయం కూడా దాటిపోయింది.

రాష్రంలోని గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ లో పదవీ కాలం గతేడాది జనవరి 31వతో ముగిసింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 జూన్ మాసంలోనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ… ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వటంతో… ఎన్నికల ప్రక్రియను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం