బీసీ రిజర్వేషన్లపై జీవోపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… జీవో 9పై స్టే విధించింది.4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా న్యాయస్థానం స్టే విధించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు రెండు వారాల్లో కౌంటర్ వేయాలని పిటిషనర్లను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. హైకోర్టు ఆర్డర్ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
అంతకుముందు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు.
ప్రభుత్వం తలపెట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని ఏజీ వాదనలు వినిపించారు. బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించామని… బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అవుతోందని చెప్పారు.
ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని ఏజీ తెలిపారు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని… ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వం తరపున మరో న్యాయవాది రవివర్మ కూడా వాదనలు వినిపించారు. 50 శాతం మించి రిజర్వేషన్ల పెంపునకు సరైన కారణాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. బుధవారంతో పాటు ఇవాళ జరిగిన వాదనలు విన్న న్యాయస్థానం… జీవో 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది.
ఇవాళ కూడా విచారణ ఉండటంతో హైకోర్టు భారీ సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. అయితే కోర్టు స్టే విధించిన తర్వాత… హైకోర్టు గేటు దగ్గర బీసీ సంఘాల ఆందోళన చేపట్టాయి. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.
హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావ్ కూడా స్పందించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఉందని విమర్శించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ నేతలు.. జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా పోరాటం చేయాలన్నారు. కలిసి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమేనేని స్ప,్టం చేశారు.
22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్… గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారని హరీశ్ రావ్ విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని దుయ్యబట్టారు.
సంబంధిత కథనం