ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? సివిల్ వివాదాల్లో జోక్యంపై పోలీసులకు హైకోర్టు హెచ్చరిక-telangana high court serious on police regarding interfere in ongoing civil disputes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? సివిల్ వివాదాల్లో జోక్యంపై పోలీసులకు హైకోర్టు హెచ్చరిక

ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? సివిల్ వివాదాల్లో జోక్యంపై పోలీసులకు హైకోర్టు హెచ్చరిక

Anand Sai HT Telugu

సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ హైకోర్టు

ివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో పోలీసులపై దాఖలైన 30 పిటిషన్లలో 25 పిటిషన్లు సివిల్ వివాదాల్లో జోక్యానికి సంబంధించినవని కోర్టు తెలిపింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ పోలీసు అధికారులు తమ విధానాన్ని ఎందుకు మార్చుకోలేదో చెప్పాలని ప్రశ్నించింది.

పోలీసులే అన్ని పనులు చేయాలనుకుంటే కోర్టులపై ఎలాంటి భారం ఉండదని జస్టిస్ టి. వినోద్ కుమార్ వ్యంగ్యంగా అన్నారు. 'దయచేసి మీ సౌలభ్యం ప్రకారం చట్టాలు, నియమాలను సవరించండి. అన్ని పనులు చేయండి.' అని అన్నారు.

రాబోయే శాసనసభ సమావేశాల్లో ఇళ్లు ఖాళీ చేయడం, అద్దె నియంత్రణ చట్టం కింద ఆస్తిని తొలగించడం, భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం, వీలునామా పత్రాలు, గిఫ్ట్ డీడ్‌లను అమలు చేయడం వంటి అన్ని బాధ్యతలను పోలీసులకు అప్పగించేలా చట్టాన్ని సవరించడానికి చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్‌లోని చక్కిపహాడ్‌లో 256 గజాల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని పోలీసులు బెదిరిస్తున్నారని దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటి స్థలం ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతున్న సివిల్ కేసులో చిక్కుకుంది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మెుహిసిస్ సోదరుడు సలాం బిన్ ఒత్తిడితో పోలీసులు తమ క్లయింట్‌ను బెదిరిస్తున్నారని న్యాయవాది అన్నారు.

దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. సివిల్ కోర్టులో దావాను ఉపసంహరించుకోవాలని ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజల్లో విశ్వాసం నింపడంలో విఫలమవుతున్నారని అన్నారు. సామాన్యులు పోలీసులను చూసి భయపడుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

2002లోనే పోలీసుల విధులకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, కానీ వాటిని విస్మరిస్తున్నారని ప్రస్తావించారు. పోలీసు కమిషనర్ దర్యాప్తునకు ఎందుకు ఉత్తర్వులు జారీ చేయలేదో, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై చర్య ఎందుకు తీసుకోలేదో చెప్పాలని అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.