TS HC On MLAs Poaching Case : సీఎంకు సమాచారం ఎవరిచ్చారు..? హైకోర్టు తీర్పులో కీలక విషయాలు -telangana high court key comments on mlas poaching case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Key Comments On Mlas Poaching Case

TS HC On MLAs Poaching Case : సీఎంకు సమాచారం ఎవరిచ్చారు..? హైకోర్టు తీర్పులో కీలక విషయాలు

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 07:30 PM IST

telangana high court on mlas poaching case: ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను కూడా ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఎత్తి చూపింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

Telangana MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సిట్ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం... కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీని హైకోర్టు... బుధవారం అందుబాటులో ఉంచింది. 98 పేజీల సుదీర్ఘమైన ఆర్డర్‌ కాపీలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. సిట్ రద్దు సహా.. ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వటం, సీబీఐకి అప్పగించటం వంటి అంశాలను పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

కేసు విచారణ కోసం ఏర్పాటైన సిట్ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్‌ విఫలమైందని ప్రస్తావించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేటంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్‌ దర్యాప్తు సక్రమంగా జరిగినట్లు అనిపించట్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 98 పేజీల తీర్పులో 45 అంశాలను ప్రస్తావించింది.

ఆధారాలన్నీ మీడియా, ప్రజల వద్దకు వెళ్లాయని ఉన్నత న్యాయస్థానం తీర్పులో ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనన్న కోర్టు... సీఎంకి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్‌ విఫలమైందని స్పష్టం చేసింది. సిట్‌ చేసిన దర్యాప్తు పారదర్శకంగా అనిపించలేదని... దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని స్పష్టం చేసింది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఎఫ్ఐఆర్‌ 455/2022 సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. కేసును సీబీఐకి దాఖలు చేయాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పక్కన పెట్టామని..నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను మాత్రం పరిగణలోకి తీసుకున్నట్లు తీర్పులో హైకోర్టు వివరించింది.

మొయినాబాద్‌ లోని ఓ ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావును కొనుగోలు చేసేందుకు యత్నించిన పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో నందకుమార్, రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహ యాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో బీజేపీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక స్వయంగా సీఎం కేసీఆర్... ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలను బయటపెట్టారు. దీనిపై లోతుగా విచారించేందుకు హైదరాబాద్ సీపీ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఏర్పాటైన సిట్... దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే.

IPL_Entry_Point