బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ.. వాడీవేడిగా వాదనలు!-telangana high court hearing on 42 percentage bc reservations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ.. వాడీవేడిగా వాదనలు!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ.. వాడీవేడిగా వాదనలు!

Anand Sai HT Telugu

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువైపులా వాడీవేడిగా వాదనలు జరిగాయి.

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీ మీద స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. రిజర్వేషన్ల మీద ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేయగా.. దీన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావుతోపాటుగా మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు

రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదు. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్‌ వర్తించదు.

42శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. బీసీ కుల గణన చేశారు. కానీ బహిర్గతం చేయలేదు. బీసీ కులగణన ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారం అని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు.

ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా చేస్తారు? రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు?

ట్రిపుల్ టెస్ట్‌ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధం.

ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు

చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు. చట్టం ఆధారంగా చేసిన జీవోలను ఛాలెంజ్ చేశారు. జీవోకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదు.

దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాయి.

రిజర్వేషన్ల గరిష్ట పరిమితి దాటకూడదని సుప్రీం కోర్టు ఆదేశామే తప్పితే.. రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది.

శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసనవ్యవస్థదే నిర్ణయం ఉంటుంది. చట్టసభలు చేసిన చట్టాలపై కొంతమంది గవర్నర్లు ఏ నిర్ణయమూ చెప్పడం లేదు. బిల్లును ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు.

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయి. ఈ సమయంలో స్టే ఇవ్వడం సరికాదు. సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి.

కులగణన సర్వే కోసం ప్రభుత్వం ఎంతో శ్రమించింది. ప్రొఫెసర్లు, టీచర్లు.. ఇలా ఎంతో మంది ఈ సర్వేలో భాగంగా ఉన్నారు.

రిజర్వేషన్లపై బుధవారం వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం గురువారం మధ్యాహ్నం కూడా 2.15 గంటలకు వాదనలు విననుంది. ఈ మేరకు సీజే జస్టిస్ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.