కాళేశ్వరం కేసులో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోవద్దంటూ సీనియర్ ఐఎస్ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారించిన న్యాయస్థానం… జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. నివేదిక ఆధారంగా ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
నిర్మాణ ప్రాంతాలను సందర్శించడం, క్షేత్ర తనిఖీలు, అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, పరిపాలనా అనుమతులు ఇవ్వడంలో ప్రమేయం వంటి వాటిని ఉదహరిస్తూ బ్యారేజీల అమలులో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కీలకమైన ఫైళ్లను క్యాబినెట్ ముందు ఉంచకపోవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది.
నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన స్మితా సబర్వాల్… తనకు సంబంధించినంత వరకు నివేదికను కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లోని సెక్షన్ 8-బి మరియు 8-సి కింద తప్పనిసరి రక్షణలను పాటించకుండా కమిషన్ తనపై "తీవ్రమైన మరియు ప్రతికూల వ్యాఖ్యలు" చేసిందని సబర్వాల్ తన పిటిషన్ లో ప్రస్తావించారు.
బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో తాను భాగం కాదని… అనుమతులు మంజూరు చేయడంలో ఎటువంటి పాత్ర లేదని స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం