Formula E Race Case : కేటీఆర్‌ ఏసీబీ విచారణ... న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి-telangana high court allowed ktr to accompany his lawyer to the acb investigation in farmula e race case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Race Case : కేటీఆర్‌ ఏసీబీ విచారణ... న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

Formula E Race Case : కేటీఆర్‌ ఏసీబీ విచారణ... న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 08, 2025 03:32 PM IST

TG HC On Formula E Race Case : ఫార్ములా ఈరేసింగ్ కేసులో కేటీఆర్ కు స్వల్ప ఊరట దక్కింది. ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఉన్నత న్యాయస్థానం తుది తీర్పును ప్రకటించనుంది.

కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఫార్ములా-ఈ కార్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… తాజాగా హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్ వేశారు. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాది విచారణ వెళ్లే అంశంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

yearly horoscope entry point

కేటీఆర్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. కేటీఆర్‌తో పాటు అడ్వొకేట్ ను ఏసీబీ విచారణకు అనుమతించాలని కోరారు. మరోవైపు ఏసీబీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రంజిత్‌ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తో పాటు న్యాయవాదిని అనుమతించవద్దని కోరారు.

ఇందుకు స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయవాదిని అనుమతిస్తే తప్పేంటని ప్రశ్నించింది. కేటీఆర్ వెంట వెళ్లే న్యాయవాది పేరు చెప్పాలని సూచించింది. ముగ్గురి పేర్లు ఇవ్వాలని… వారిలో ఒకరు ఆయన వెంట వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఈ విషయంలోనూ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. విచారణ గదిలో కాకుండా… బయట గది వరకే న్యాయవాదికి అనుమతి ఉంటుంది. విచారణ గదిలోకి కేవలం కేటీఆర్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ కు సంబంధించిన తుది తీర్పును ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలువరించనుంది.

ఏసీబీ నోటీసులు - రేపు కేటీఆర్ విచారణ:

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ కు ఈడీతో పాటు ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఓసారి ఏసీబీకి ఆఫీస్ వరకు వెళ్లిన కేటీఆర్… న్యాయవాదిని అనుమతించకపోవటంతో వెనుదిరిగి వచ్చారు. అయితే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 9న హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే న్యాయవాదిని అనుమతించే విషయంపై కేటీఆర్.. కోర్టును ఆశ్రయించారు.

ఏసీబీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్.. రేపు ఏసీబీ ముందుకు రానున్నారు. ఫార్ములా ఈరేసింగ్ వ్యవహారంపై అధికారులు విచారించనున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ ఫార్ములా ఈ -కారు రేసు కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఇటీవలే ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిశోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం